ఘోర ప్రమాదం: బస్సు-ఆటో ఢీ, ఆరుగురు మహిళలు మృతి, మరో నలుగురికి గాయాలు
తూర్పుగోదావరి: కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తాళ్లరేవు మండలం క్వారింగ పంచాయతీ పరిధిలోని సుబ్బరాయుని దిమ్మె కూడలిలో ఆదివారం మధ్యాహ్నం ప్రైవేటు బస్సు, ఆటో డీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సీతారామపురంలోని రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు విధులు ముగించుకుని నేలపల్లి, యానాం గ్రామాలకు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలోనే కొద్ది సేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు వేగంగా వచ్చి ఆటోను ఎదురెదురుగా ఢీకొంది. దీంతో ఆటో నుజ్జునుజ్జయ్యింది. ఆటోలోని ఆరుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి.

ఆటోలో ఇద్దరి మృతదేహాలు ఇరుక్కుపోగా.. స్థానికుల సాయంతో బయటకు తీశారు. మృతదేహాలను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలిని మాజీ మంత్రి కన్నబాబు, యానాం, ముమ్మడివరం ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్ కుమార్, శ్రీనివాస్ అశోక్ పరిశీలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పడవ బోల్తా పడి: ఇద్దరు మృతి, 12 మంది గల్లంతు
ఆదివారంనాడు సరదాగా విహారయాత్రకు వెళితే.. విషాదం చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో పడవ బోల్తాపడి 12 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో రెండు మృతదేహాలు లభ్యమ్యాయి. మిగతావారి కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను పర్యాటకులుగా గుర్తించారు.
మరో 9 మందిని స్థానికులు రక్షించారు. అయితే ప్రమాద సమయంలో పర్యాటకులు లైఫ్ జాకెట్లు ధరించలేదని అధికారులు గుర్తించారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో ఇటువంటి దుర్ఘటనలు జరిగిన దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. రెండేళ్ల కిందటే అవుకు జలాశయంలో బోటు షికారు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications