ఆట మొదలైంది: పార్టీ వీడుతున్న టీడీపీ ముఖ్యులు..!: కీలక నేతలతో మంతనాలు..!
Recommended Video
ఏపీలో అధికార మార్పిడి పూర్తి స్థాయిలో జరగకుండానే..మరో ఆట మొదలైంది. ఇప్పటి వరకు అధికార పార్టీలో ఉంటూ అనేక అభియోగాలు ఎదుర్కొన్న నేతలు ఇప్పుడు పార్టీ మారటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. వైసీపీ లోకి వారికి అవకాశం లేదు. కాంగ్రెస్ అడ్రస్ లేదు. ఇక, బీజేపీలోకి వెళ్లక తప్పదు. దీంతో..అప్పుడే బీజేపీ ముఖ్య నేతలతో మంతనాలు ప్రారంభించారు. వారం పది రోజుల్లోనే వారు పార్టీ మారటం ఖాయంగా కనిపిస్తోంది.

టచ్‌లోకి మాజీ మంత్రి..
ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు గుంటూరు జిల్లాలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన ముఖ్య నేత బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన బీజేపీకి చెందిన ఓ ముఖ్య నేతతో వ్యాపార సంబంధాలు ఎప్పటి నుండో ఉన్నాయి. దీంతో..ఆయన ఇప్పుడు తన వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వచ్చిన తరువాత అధినేతతో కలిసిన ఆయన..ఇక, ఇప్పట్లో ఏపిలో టీడీపీ అంత త్వరగా కోలుకొనే అవకాశం లేదనే అంచనాతో ఉన్నారు. దీంతో..ఫలితాలకు ముందే హైదరాబాద్‌లో
మకాం వేసి ముందస్తుగానే మంతనాలు చేసినట్లు సమాచారం. ఇక, ఫలితాల సమయంలో చివరకు తన గెలుపు ఖాయమని భావించినా.. చివరకు ఓటమి తప్పలేదు. దీంతో..ఏపీలో భవిష్యత్‌లో చోటు చేసుకొనే రాజకీయాల పైన తన సన్నిహితులతో చర్చించి ఒక అంచనాకు వచ్చారు. వైసీపీలోకి వెళ్లే పరిస్థితి లేదు. తన నియోజకవర్గంలో ఇద్దరు కీలక మైన నేతలు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. దీంతో..తనకు అక్కడ ప్రాధాన్యత ఉండదని నిర్ణయానికి వచ్చి...బీజేపీ ముఖ్య నేతలతో మంతనాలు ప్రారంభించారు.

పల్నాడు ముఖ్య నేత సైతం..
ఈ మంత్రి బాటలోనే పల్నాడు ప్రాంతానికి చెందిన మరో ముఖ్య నేత సైతం బీజేపీ నేతలతో టచ్‌లోకి వచ్చారు. ఆయన పైన మైనింగ్ అక్రమ తవ్వకాల పైన సీబీఐ విచారణ పెండింగ్ ఉంది. అదే సమయంలో ఇతర సమస్యల కారణంగా ఆయన బీజేపీ వైపు మళ్లుతున్నట్లు సమాచారం. ఆయన విశాఖలో బీజేపీలో ఉన్న తన మిత్రుడు ద్వారా రాయబారాలు నడుపుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్యుడితో భేటీ అయ్యారు. తాను తన అనుచరులతో కలిసి బీజేపీలోకి రావటానికి సిద్దంగా ఉన్నట్లు సంసిద్దత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, చాలా కాలంగా టీడీపీలో ఉంటూ గత ప్రభుత్వ హయాంలో మంత్రి కాకపోయినా... ఆ స్థాయిలో తన అధిపత్యం కొనసాగించారు. దీంతో..ఇప్పుడు ఆయన సడన్‌గా బీజేపీలోకి వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలు హాట్ టాపిక్‌గా మారాయి.

మరో మాజీ ఎంపీ సైతం..
ఇప్పటికే ఆర్దికంగా.. ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ తాజా ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిన సీనియర్ నేత సైతం బీజేపీ వైపు నడుస్తున్నారు. ఆయన ఒక ప్రత్యేక్ష రాకీయాల్లో కొనసాగే అవకాశాలు లేవని చెబుతున్నా.. ముందున్న సమస్యలను గట్టెక్కాలంటే బీజేపీ లోకి వెళ్లటమే మార్గంగా భావిస్తున్నారు. అయితే, తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి పార్టీలో కీలక పదవిలో ఉండటంతో ఆయన ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే, మరో వారం పది రోజుల్లో వీరంతా బీజేపీ బాట పట్టటం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.












Click it and Unblock the Notifications