తప్పు చేస్తే జైలుకే: కాకానిపై సోమిరెడ్డి నిప్పులు, డీజీపీకి ఫిర్యాదు
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విజయవాడ: తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమిరెడ్డి శుక్రవారం ఉదయం డీజీపీ సాంబశివరావును కలిశారు.
వైసీపీ నేత కాకాని గోవర్థన్‌రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన ఆస్తులపై నకిలీ దస్తావేజులు సృష్టించి ఆరోపణలు చేస్తున్నారని.. వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీని కోరారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకాని నకిలీ దస్తావేజులతో ఆరోపణలు చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను తప్పు చేస్తే శిక్షకు సిద్ధమేనని స్పష్టం చేశారు. కాకానిపై కల్తీ మద్యం కేసు సహా ఆరు కేసులున్నాయన్నారు.

నకిలీ దస్తావేజులు సృష్టించే ముఠాకు కాకాని నాయకుడని.. ఇలాంటి వారితో నిజాయతీగా రాజకీయాలు చేసేవారి ఉనికికే ప్రమాదమన్నారు. కాకాని ఇచ్చిన 30 దస్తావేజుల్లో ఒక్కటైనా నిజమని నిరూపించగలరా? అని సవాల్ చేశారు. తనపై కాకాని సీబీఐకి ఫిర్యాదు చేస్తే.. విచారణ చేయాలని నేనే ఆహ్వానిస్తానని అన్నారు.
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి విదేశాల్లో కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని కాకాని పలు డాక్యుమెంట్లు చూపిన విషయం తెలిసిందే. కాకానిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు సోమిరెడ్డి చెప్పారు. తనకు సింగపూర్, బ్యాంకాక్, హ్యాంకాంగ్‌లలో ఆస్తులు ఉన్నాయంటూ కాకాని ఎన్నో తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించారని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో కల్తీ మద్యం కేసులో ఇరుక్కుపోయిన కాకాని ఇప్పుడు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని సోమిరెడ్డి అన్నారు. ఇప్పటికే ఆయన ఆరు కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని చెప్పారు. కాకాని చూపిస్తున్న డాక్యుమెంట్లు అన్నీ నకిలీవని సోమిరెడ్డి అన్నారు.
సోమిరెడ్డి ఫిర్యాదుతో దర్యాప్తు
సోమిరెడ్డి ఫిర్యాదుతో నెల్లూరు పోలీసులు ఫోర్జరీ చేసిన వ్యక్తుల కోసం నెల్లూరు వేట ప్రారంభించారు. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తెలిపారు.












Click it and Unblock the Notifications