కేసీఆర్ ఫామ్ హౌస్ కు, జగన్ ప్యాలెస్ కు పరిమితం: సోమిరెడ్డి సెటైర్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలలో వైసీపీ ఓటమిపాలు కావడంతో టీడీపీ కూటమి అధికారాన్ని చేపట్టి పాలన కొనసాగిస్తోంది. ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాల పరిష్కారానికి చర్చలు జరుపబోతున్నారు.
కేసీఆర్, జగన్ లపై సోమిరెడ్డి సెటైర్లు
ఈ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులపైన టిడిపి సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన వారిద్దరి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ లో మొన్నటివరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వారిలో ఒకరు ఫామ్ హౌస్ కు, మరొకరు ప్యాలెస్ కు పరిమితమయ్యారని ఆయన సెటైర్లు వేశారు.

చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చలపై సోమిరెడ్డి వ్యాఖ్యలు
గతంలో జరిగిన ఎన్నికలలో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కనిపించకుండా నియంతలాగా వీరిద్దరూ వ్యవహరించారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఇక ఇదే సమయంలో ప్రస్తుత సీఎంలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యంగా ఈరోజు హైదరాబాదులోని ప్రజా భవన్ లో చర్చలు జరపబోతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.
ప్రజలకు మంచి రోజులు వచ్చాయి
నేడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చలతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి రోజులు వచ్చాయని రానున్న రోజుల్లో తెలుగు జాతికి నిండు వెలుగులు రావడం ఖాయమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీ సానుకూలంగా సాగుతుందని ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యున్నతికి కీలక నిర్ణయాలు తీసుకుంటారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
భిన్నంగా స్పందిస్తున్న నెటిజన్లు
అయితే దీనిపైన నెటిజన్ల నుండి విభిన్నమైన స్పందన వస్తోంది. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు.. ఇంకా ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చలు జరపనేలేదు.. అప్పుడే మంచి రోజులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు సీఎం కేసీఆర్, జగన్ గురించి మీకెందుకు.. మీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండేలా చూసుకోండి అంటూ సెటైర్లు వేస్తున్నారు.
సోమిరెడ్డి వ్యాఖ్యలపై చర్చ
ఇంకొందరు ఎప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయి కేసీఆర్ గురించి, జగన్ గురించి ఎందుకు? ముందు మీ పని మీరు చూసుకోండి అంటూ సలహా ఇస్తున్నారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ వేళ సోమిరెడ్డి వ్యాఖ్యలతో ఆసక్తికర చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications