పవన్ కళ్యాణ్‌కు వైసీపీ అలా, అర్థం చేసుకోవాలని బీజేపీ సోము వీర్రాజు
చిత్తూరు/విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని అర్థం చేసుకున్నారని, ఆయన లాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా అర్థం చేసుకోవాలని బీజేపీ నేత సోము వీర్రాజు శుక్రవారం నాడు అన్నారు. పవన్ తిరుపతి, కాకినాడ సభలలో చేసిన ప్రసంగం పైన అంతగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
కాగా, ప్రజల్లో సెంటిమెంట్‌గా మారిన ప్రత్యేక హోదా అంశంలో తమ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తోన్న నేపథ్యంలో ప్యాకేజీపై విస్తృత ప్రచారం చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. దాని కోసం తాము ప్రణాళిక రూపొందించుకున్నట్లు సోము వీర్రాజు ఈ రోజు తెలిపారు.

కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయాన్ని వివరిస్తూ ప్యాకేజీ వివరాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఈ నెల 22న రాజమండ్రిలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పర్యటిస్తారని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం అందించిన సాయంతో ఎన్నో ప్రయోజనాలున్నాయన్నారు. టిడిపి నేతలు కూడా పవన్‌కు అదే విషయం చెబుతున్నారు.
మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్ తీరును తప్పుబడుతోంది. లెఫ్ట్ పార్టీలు ప్రత్యేక హోదా పైన పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేసేందుకు ఉవ్వీళ్లూరుతున్నాయి. హోదా పైన చిత్తశుద్ధితో పోరాడితే తాము ఆయనతో కలుస్తామని చెప్పారు.
మొదటి నుంచి పవన్ కళ్యాణ్ పైన వైసిపి మాత్రం అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆయన వెనుక టిడిపి, బిజెపిలు ఉన్నాయని ఆరోపిస్తోంది. గురువారం నాడు కూడా వైసిపి ఎమ్మెల్యే రోజా.. పవన్ పైన మండిపడ్డారు. పవన్‌కు ప్రజా సేవ చేయాలని, రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంటే గోడమీది పిల్లిలా కాకుండా ప్రజా సమస్యల పైన పోరాడాలని సవాల్ చేశారు.
చేతనైతే ఎన్టీఆర్‌లా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి చూపాలన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నాడు పవన్ కూడా ప్రత్యేక హోదా వస్తుందని చెప్పారని, ఇప్పుడిక రెండున్నరేళ్ల తర్వాత ఇంకా వేచి చూసే ధోరణి ఏమిటని నిలదీశారు.












Click it and Unblock the Notifications