తల్లిని పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన తనయుడు.. ఏపీలో షాకింగ్ ఘటన!!
నవమాసాలు మోసి , కని పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని అత్యంత కర్కశంగా హత మార్చాడు ఓ తనయుడు. మద్యం సేవించడానికి డబ్బులు అడిగితే తల్లి ఇవ్వనందని ఆగ్రహించిన తనయుడు ఏకంగా పెట్రోల్ పోసి తల్లిని తగలబెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కంబదూరులో ఓబయ్య కాలనీకి చెందిన ఈడిగ గోపీనాథ్, సుజాతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు కాగా వారిరువురు ఉద్యోగాలలో స్థిరపడి వారి జీవితాలను గడుపుతున్నారు. అయితే గోపీనాథ్, సుజాతమ్మల కొడుకు ప్రణీత్ ఇంటర్ తర్వాత చదువు మానేసి, హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు.

ఇక మద్యానికి బానిసైన అతను ఇటీవల ఉద్యోగం మానేసి ఇంటికి చేరుకున్నాడు. ప్రతిరోజు మద్యం తాగడానికి డబ్బులు కావాలని తల్లిదండ్రులను వేధించేవాడు. ఈ క్రమంలో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని అనారోగ్యంతో మంచం లో ఉన్న తల్లిని అడిగాడు. అయితే ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహించిన కొడుకు తల్లి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఇక చుట్టుపక్కల వారు మంటలను గమనించి సుజాతమ్మ భర్త గోపీనాథ్ కు సమాచారం అందించారు. ఆయన వచ్చేలోపే మంటల్లో హాహాకారాలు చేస్తూ కాలిపోయిన సుజాతమ్మ మృతి చెందింది. పేగుతెంచుకు పుట్టిన కొడుకు జన్మనిచ్చిన తల్లి అని మరచిపోయి చేసిన దారుణమైన పనికి తల్లి ప్రాణాలు కోల్పోగా, తండ్రి భార్య చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాడు.
ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత కర్కశంగా తల్లిని హతమార్చిన తనయుడు ప్రణీత్ ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు విచారణ చేస్తున్నారు. వ్యసనాలకు బానిసలై మానవత్వం కూడా లేకుండా ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారు సభ సమాజాన్ని షాక్ కు గురి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications