మొట్టికాయలేనా: చిరు, రఘువీరాలకు సోనియా పిలుపు
హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి, అంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డిలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి పిలుపు వచ్చింది. జూన్ రెండో తేదీన ఢిల్లీకి వచ్చి తనను కలుసుకోవాల్సిందిగా ఆమె ఆదేశించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒక్క సీటును కూడా కాంగ్రెసు గెలుచుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం చిత్తుచిత్తుగా ఓడిపోయారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెసుకు అవి ఊహించిన ఫలితాలేనని అంటున్నారు. ఎన్నికల ఓటమిపై సమీక్ష నిర్వహించేందుకు వారిద్దరిని ఢిల్లీకి రావాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో వారిద్దరిని సోనియా మొట్టికాయలు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో కూడా తగిన ఫలితాలు సాధించలేదు. ఈ ఫలితాలపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికే ఓ నివేదిక సమర్పించినట్లు సమాచారం. తెలంగాణలో ఫలితాలపై కాంగ్రెసు అధిష్టానం సమీక్ష కూడా చేసింది.












Click it and Unblock the Notifications