Tirupati-Sainagar Shirdi: తిరుపతి-షిర్డీ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి, మహారాష్ట్రలోని మరో పుణ్యక్షేత్రం షిర్డీ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. పండుగలు, కొత్త సంవత్సర సీజన్ లో ఈ రెండు పుణ్యక్షేత్రాల మధ్య ప్రయాణించే వారి కోసం ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. ఇవాళ వాటిని పొడిగిస్తూ మరో నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త ఏడాది వేళ భక్తులకు రద్దీ నుంచి కాస్త విముక్తి లభించనుంది.
ప్రస్తుతం పండుగల సీజన్ దృష్ట్యా నడుపుతున్న ప్రత్యేక రైళ్లలోనూ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని మరికొంతకాలం పొడిగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుపతి నుంచి షిర్డీ సాయినగర్ కు ప్రతీ ఆదివారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07637ను నవంబర్ 30 నుంచి డిసెంబర్ 28 వరకూ పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కన ఐదు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.

అలాగే సాయినగర్ షిర్డీ నుంచి తిరుపతికి ప్రతీ సోమవారం నడుపుతున్న ప్రత్యేక రైలు నంబర్ 07638ని డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 29 వరకూ పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా మరో ఐదు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లను ఇప్పటికే అమల్లో ఉన్న ఛార్జీలతో పాటు ఆన్ లైన్ అడ్వాన్సెడ్ బుకింగ్స్ కూడా అమల్లో ఉంటాయి.

మరోవైపు చర్లపల్లి-తిరుపతి మధ్య ప్రతీ బుధవారం, గురువారం నడుపుతున్న ప్రత్యేక రైళ్లకు దిగువమెట్టలో అదనపు హాల్ట్ ఇస్తూ రైల్వే మరో నిర్ణయం తీసుకుంది. దీంతో చర్లపల్లి నుంచి తిరుపతికి బుధవారం నడుపుతున్న ప్రత్యేక రైలు దిగువమెట్టలో తెల్లవారు జామున 4.30కు ఆగనుంది. అలాగే తిరుపతి నుంచి చర్లపల్లికి ప్రతీ గురువారం నడుపుతున్న ప్రత్యేక రైలు దిగువమెట్టలో రాత్రి 11.30కు ఆగనుంది. మరోవైపు చర్లపల్లి నుంచి కొల్లాంకు సోమవారం నడుపుపుతున్న ప్రత్యేక రైలుకు కావలిలో రాత్రి 9.13కు అదనపు హాల్ట్ ఇచ్చారు. కొల్లం నుంచి చర్లపల్లికి వచ్చే బుధవారం ప్రత్యేక రైలుకు కావలిలో అర్ధరాత్రి 12.33కు హాల్ట్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications