హైదరాబాద్, అనకాపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!
తెలంగాణలోని చర్లపల్లి నుంచి ఏపీలోని అనకాపల్లి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. అసలే పండుగల సీజన్ కావడంతో రైళ్లన్నీ రద్దీగా మారిపోతున్న వేళ .. ఇప్పటికే నడుపుతున్న రెండు ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగించాలని నిర్ణయించింది. చర్లపల్లి నుంచి అనకాపల్లి మధ్య ప్రస్తుతం రెండు స్పెషల్ రైళ్లు వారాంతంలో అంటే శని, ఆదివారాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. వీటి గడువు ముగుస్తుండటంతో మరికొంతకాలం పొడిగించారు.
అయితే ప్రస్తుతం చర్లపల్లి నుంచి అనకాపల్లికి నడుపుతున్న రైలు నంబర్ 07035 ప్రత్యేక రైలును రేపటి నుంచి నవంబర్ 29 వరకూ పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ప్రతీ శనివారం ఇకపై హైదరాబాద్ నుంచి అనకాపల్లి వెళ్లేందుకు అందుబాటులో ఉంటుంది. అలాగే అనకాపల్లి నుంచి చర్లపల్లికి వెళ్లే మరో రైలు నంబర్ 07036 ను కూడా నవంబర్ 30వ తేదీ వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు కూడా అనకాపల్లి నుంచి హైదరాబాద్ వరకూ ఆదివారం అందుబాటులో ఉంటుంది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లకు కూడా మధ్యలో సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి స్టేషన్లలో హాల్ట్ లు ఇచ్చారు. అలాగే వీటిలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

దసరా పండుగ ముగిసినా త్వరలో దీపావళి పండుగ రానుండటం, ఆ తర్వాత కూడా సంక్రాంతి వరకూ రద్దీ కొనసాగే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి నవంబర్ వరకూ ఈ రెండు ప్రత్యేక రైళ్లను పొడిగించారు. ఆ తర్వాత పరిస్ధితిని బట్టి మళ్లీ వీటి కొనసాగింపుపై రైల్వే నిర్ణయం తీసుకోనుంది.












Click it and Unblock the Notifications