మళ్లీ సీఎంగా జగన్ - చంద్రబాబు అవమానించారు : స్పీకర్ తమ్మినేని - బస్సు యాత్ర..!!
ఏపీ మంత్రులు నిర్వహిస్తున్న సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర రెండో రోజుకు చేరింది. విశాఖ నుంచి ఈ యాత్ర మొదలైంది. తొలి రోజున శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర తొలి రోజు సాయంత్రం విజయనగరం చేరుకుంది. అక్కడ నిర్వహించాల్సిన బహిరంగ సభ వర్షం కారణంగా వాయిదా పడింది. ఈ ఉదయం విశాఖలో జరిగిన సభలో స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సంతృప్తికర పాలన కొనసాగుతోందన్నారు. మళ్లీ సీఎం జగన్‌ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని చెప్పుకొచ్చారు.
మేనిఫెస్టోను తుంగలో తొక్కిన వ్యక్తి, చరిత్ర హీనుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. దళితులను అవమానించిన వ్యక్తి చంద‍్రబాబని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం చేస్తుంటే కొన్ని ప్రతిపక్ష పార్టీలు అల్లర్లకు పాల్పడుతున్నాయంటూ మండిపడ్డారు. దళిత మంత్రి ఇంటికి నిప్పు పెట్టడం అమానుషమన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని సమర్ధిస్తారా లేదా ప్రతిపక్ష పార్టీలు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేసారు. గడప గడపకి వెళ్తుంటే ప్రజలు జగన్ వెంట ఉంటామని అంటున్నారని తమ్మినేని చెప్పుకొచ్చారు. కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం పదవులు ఇచ్చారని హోం మంత్రి తానేటి వనతి చెప్పుకొచ్చారు.

దేశంలో ఎక్కడా ఇలా పదవులు ఇవ్వలేదని చెబుతూ.. గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంత గౌరవం, రాజ్యాధికారం ఇచ్చిన వారు లేరని పేర్కొన్నారు. అమలాపురం ఘటనలో టీడీపీ, జనసేన పాత్ర స్పష్టమైందన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఈ రెండు పార్టీల వారే ఉన్నారన్నారు. ఆధారాలు, ఫొటోలు, వీడియోలతో ఆధారంగా వారిని అరెస్ట్ చేశామని వివరించారు. చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారని హోం మంత్రి ప్రశ్నించారు. తాను వీళ్ళ పాత్ర ఉందని ముందే చెప్పానన్నారు. బస్సు యాత్రకి స్పందన లేదనడం చంద్రబాబు అవివేకమన్నారు. ప్రతీ చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సీఎం జగన్ పాలనను ప్రశంసిస్తున్నారని తానేటి వనిత చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications