ప్రత్యేక హోదా: వెంకయ్యకు చిక్కులు, చంద్రబాబు కొంత సేఫ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఎక్కువ సమస్యను ఎదుర్కుంటున్నారు. ఆ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొంత మేరకు సేఫ్ జోన్‌లో ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో పట్టుబట్టి ఐదేళ్ల నుంచి పదేళ్లకు పొడిగించేలా హామీ తీసుకున్న వెంకయ్య నాయుడు ఇప్పుడు అన్ని పార్టీలకూ లక్ష్యంగా మారారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చి పాగా వేద్దామని అనుకున్న బిజెపి నాయకులకు ప్రత్యేక హోదా మొదటికే మోసం తెచ్చేట్లుంది. ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా కాంగ్రెసు పార్టీ నుంచి బిజెపిలోకి వచ్చిన మాజీ పార్లమెంటు సభ్యులు, సీనియర్ నేతలు కూడా రాష్ట్రంలో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక హోదా లభిస్తుందని చెప్పడం తప్ప గ్యారంటీగా హామీ ఇవ్వలేకపోతున్నారు.
ప్రత్యేక హోదా విషయంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేస్తుందనే నమ్మకాన్ని ఎక్కువగా ప్రజలు బిజెపిపైనే ఉంచారు. కేంద్రంలో అధికారంలోకి రావడంతో హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కూడా బిజెపిపైనే పడింది. ఇప్పుడు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ వంటివారు కూడా ప్రత్యేక హోదా వస్తుందని నమ్మకంగా చెప్పలేకపోతున్నారు.

రాష్ట్ర విభజనకు నవ్యాంధ్ర ప్రదేశ్ ప్రజలు కాంగ్రెసు చావు దెబ్బ తీసి కక్ష తీర్చుకున్నారు. కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించిన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కూడా అధికారం కట్టబెట్టలేదు. కేంద్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తయినా ప్రత్యేక హోదాపై రోజుకో ప్రకటన చేస్తూ బిజెపి నాయకులు అయోమయాన్ని సృష్టిస్తున్నారు. ఇది రాష్ట్రంలోని బిజెపి నాయకులకు దిక్కు తోచని పరిస్థితిని కల్పించింది.
ఈ పరిస్తితిలో చంద్రబాబు కాస్తా వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రత్యేక హోదా రాదనే సంకేతాలను పంపించారు. తాము పోరాటం చేస్తామని చెబుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అందుకు బాధ్యత తీసుకోవాలనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. దీంతో చంద్రబాబు కొంత మేరకు సమస్య నుంచి పక్కకు జరగడంలో ఫలితం సాధించారు. ఈ స్థితిలోనే టిడిపి వైఖరిపై సోము వీర్రాజు వంటి బిజెపి నేతలు మండిపడుతున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి దీటుగా ఎదుగుతుందని భావించిన బిజెపికి ఎదురు దెబ్బలు తప్పేట్లు లేవు. పార్టీ పుంజుకుంటుందనే ఉద్దేశంతోనే పలువురు సీనియర్ నాయకులు బిజెపిలో చేరారు. వారికి ఇప్పుడు చేతినిండా పని కూడా లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications