కొత్త అసెంబ్లీ 'స్పెషాలిటీస్' ఇవే!: మైకులు విరగొట్టడం ఇక కుదరదు..
అసెంబ్లీలో స్పీకర్ ఛైర్ ను ఏడడుగుల ఎత్తులో నిర్మించడం విశేషం. స్పీకర్ ఛైర్ అత్యంత ఆకర్షనీయంగా తీర్చిదిద్దారని సమాచారం.
అమరావతి: రాష్ట్ర విభజన కష్టాలను ఎదుర్కొంటూనే పాలనా పరంగా ఒక్కో ముందడుగు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. తొలుత సచివాలయం, ఇప్పుడు అసెంబ్లీ భవన నిర్మాణం. నేటి ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెలగపూడిలో నిర్మించిన అసెంబ్లీ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అసెంబ్లీలో సదుపాయాలు, సౌకర్యాల పట్ల సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త అసెంబ్లీ ప్రత్యేకతలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకసారి ఆ ప్రత్యేకతలను పరిశీలిస్తే..

ఒకే సముదాయంలో..
*ఒకే సముదాయంలో అసెంబ్లీ, సచివాలయం నిర్మించడం విశేషం.
*సచివాలయ ప్రాంగణంలోని రెండెకరాల స్థలంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు.
*అసెంబ్లీలో మొత్తం 260మంది కూర్చునేలా దాని నిర్మాణం జరిగింది.
*శాసనమండలిని 90మంది సభ్యులు కూర్చొనే సామర్థ్యంతో నిర్మించారు.
*అసెంబ్లీలో స్పీకర్ ఛైర్ ను ఏడడుగుల ఎత్తులో నిర్మించడం విశేషం. స్పీకర్ ఛైర్ అత్యంత ఆకర్షనీయంగా తీర్చిదిద్దారని సమాచారం.
*స్పీకర్ ఛైర్ కు రెండు పక్కలా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.
*సభలో మైకులు విరగ్గొట్టేందుకు అవకాశం ఉండదు. సెన్సార్ మైక్ సిస్టమ్ తో సభలో సభ్యుల వాదనలను రికార్డు చేస్తారు.
*సీఎంకు, స్పీకర్ కు ప్రత్యేక మీటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు.
*మొత్తం ఐదు అత్యాధునిక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వీటిలో మీడియాకు 2, అధికారులు, వీఐపీలు, సందర్శకులకు ఒక్కో గ్యాలరీ కేటాయించారు.
*త్వరితగతిన రికార్డు సమయంలో ఈ భవనాలను పూర్తి చేయడం విశేషం. ఎల్ అండ్ టీ, సీఆర్డీఏలు వీటిని నిర్మించాయి.
*సచివాలయ ప్రాంగణంలో ఇప్పటికే పలు భవనాలు ఉండగా.. ఆరో భవనంగా అసెంబ్లీని, శాసనమండలిని నిర్మించారు.












Click it and Unblock the Notifications