తిరుమలలో కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో శ్రీ మలయప్ప !
తిరుమల/తిరుపతి: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి కల్పవృక్ష వాహనంపై రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల గోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది.
కల్పవృక్ష వాహనం, ఐహిక ఫల ప్రాప్తి అని పురాణాలు చెబుతున్నాయి.
క్షీరసాగరమథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి.

అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగో రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివితీరా దర్శనమిస్తాడు కలియుగ వైకుంఠ దేవదేవుడు శ్రీనివాసుడు.
ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు.

వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంలో తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తారుగా ఉంది. బుధవారం శ్రీవారిని 64, 277 మంది భక్తులు దర్శించుకున్నారు.

బుధవారం 24, 340 మంది భక్తులు శ్రీవారిరి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. హుండీ కానుకల ద్వారా బుధవారం రూ. 2. 89 కోట్ల రూపాయల ఆధాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో నాలుగు కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉండటంతో సర్వదర్శనం టోకన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పట్టింది.












Click it and Unblock the Notifications