TTD: ఆ రోజున పది గంటలకు పైగా శ్రీవారి ఆలయం మూసివేత - సేవలు రద్దు..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగు తున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. క్యూ లైన్ మేనేజ్ మెంట్ విధానం ద్వారా భక్తులకు వేగంగా దర్శనం కలిగించేలా టీటీడీ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా, శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. మార్చి 3వ తేదీన దాదాపు పది గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు వెల్లడించింది. సేవలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
టీటీడీ భక్తులకు కీలక సమాచారం ఇచ్చింది. మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత పైన ప్రకటన చేసింది. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. దీంతో, ఆ రోజున శ్రీవారి ఆలయం మూసివేతకు నిర్ణయించారు. సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు.

అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుంది. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, తిరుమలలో కమాండ్ కంట్రోల్ రూం ద్వారా వైకుంఠ ద్వార దర్శనాల వేళ రద్దీని టీటీడీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉంటే.. అక్కడ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సంక్రాంతి సెలవుల వేళ తిరుమలలో రద్దీ పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 8వ తేదీతో ఉత్తర ద్వార దర్శనం పూర్తి కానుంది. కాగా.. టీటీడీకి సంబంధించిన విశిష్ఠత .. సేవలు ఎప్పటికప్పుడు భక్తులకు తెలియచేసేలా టీటీడీ కొత్త విధానం అమల్లోకి తేవాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications