‘అమరావతి నుంచి అహ్మద్ పటేల్ వరకు.. అవినీతి చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం’
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైస్సార్ కాంగ్రెస్ నేత, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవినీతికి బ్రాండ్ చంద్రబాబు అని విమర్శించారు. హడావుడిగా ఆస్తులను ప్రకటించడంపై వెనుక అనేక అనుమానాలున్నాయన్నారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆ ఆస్తులన్నీ డుప్లికేట్..
చంద్రబాబు ప్రకటించిన ఆస్తులన్నీ డుప్లికేటేనని, ఐటీ విచారణలో అసలు నిజాలు బయటపడుతున్నాయనే కారణంతో ఆస్తులు ప్రకటించారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పీఎస్ ఇంట్లో దాడులు చేస్తేనే.. రూ. 2వేల కోట్ల అక్రమ లావాదేవీలు బయటపడ్డాయన్నారు. చంద్రబాబు 7 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి..
చంద్రబాబు విదేశాల్లో ఉన్న ఆయన బినామీ ఆస్తులు బయటపెట్టాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులని, చేసేవన్నీ తప్పుడు పనులని విమర్శించారు. చంద్రబాబు 100 తప్పులపై బీజేపీ ఛార్జీషీట్ కూడా వేసిందన్నారు. చంద్రబాబు అవినీతి సామ్రాట్ అంటూ వామపక్షాలు పుస్తకం కూడా విడుదల చేశాయన్నారు.

అమరావతి నుంచి అహ్మద్ పటేల్ వరకు...
అక్రమ ఆస్తులపై లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్‌పై చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని అన్నారు. అమరావతి నుంచి అహ్మద్ పటేల్ వరకు జరిగిన హవాలాపై నిప్పునాయుడు ఎందుకు స్పందించడం లేదని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీకి ఎంత కప్పం కట్టారో బయటపడుతోందని వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి, కేసుల కోసమే చంద్రబాబు రాష్ట్ర విభజనకు సహకరించారని ఆరోపించారు.

జైలుకెళ్లడం ఖాయం..
చంద్రబాబు చేసిన అవినీతికి దేవుడు కూడా కాపాడలేడని, భవిష్యత్తులో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు ఒక మాఫీయాను సృష్టించారన్నారు. ప్రతి నెలా రూ. 5 కోట్లు పెట్టి మాఫియాను నడిపిస్తు్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. త్వరలోనే ఆ మాఫియాను బయటపెడతామని అన్నారు.

బినామీలను కాపాడుకునే యాత్రే..
అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబును ఎల్లో మీడియా కాపాడుతుందని మండిపడ్డారు. చంద్రబాబుది జనచైతన్య యాత్ర కాదని, బినామీలను కాపాడుకునే యాత్రగా శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పొత్తులు లేకుండా ఏ ఎన్నికల్లోనూ గెలవలేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications