మిస్‌ ఇండియాగా బందరు వనిత, పోటీతత్వం తెచ్చిపెట్టిన విజయం

Subscribe to Oneindia Telugu

విజయవాడ: బాహ్య సౌందర్యంతో పాటు అంతః సౌందర్యం కూడా తోడైతే ఏరంగంలో అయినా విజయాన్ని సాధించవచ్చని తెలుగమ్మాయి అద్దేపల్లి శ్రీశుభ నిరూపించింది.

మచిలీపట్నానికి చెందిన శ్రీశుభ సౌత్‌ ఆఫ్రికా గాటెంగ్‌ నిర్వహించిన అందాల పోటీల్లో మిస్ ఇండియాగా ఎంపికైంది. భారతీయ మహిళల్లో నిబిడీకృతమై ఉండే సున్నితత్వం, భావోద్వేగం, అనురాగం, ఆత్మస్థైర్యం వంటి అంశాలను మూడు నిమిషాల సోలో ప్రదర్శనలో భావయుక్తంగా చాటిన శ్రీశుభ తోటి పోటీదారులపై పైచేయి సాధించింది.

శ్రీశుభ చిన్నప్పటినుంచే తన ప్రతిభ చాటుతోంది. తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరరావు హిందూ హైస్కూల్లో పనిచేశారు. ఆమె చదువు ఇంటర్‌ వరకు పట్టణంలోనే సాగింది. పదో తరగతి వరకు స్థానిక సెయింట్‌ ఫ్రాన్సిస్‌ పాఠశాలలో, ఇంటర్‌ స్థానిక శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేసింది.

ఆ తరువాత విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్‌ చదివింది. బీటెక్‌ చదువుతున్న సమయంలో ప్రాంగణ ఎంపికల్లో విప్రో కంపెనీలో ఉద్యోగం పొందింది. ఉద్యోగవిధుల్లో భాగంగా ఆమెను కంపెనీ దక్షిణాఫ్రికాకు పంపించింది. అక్కడ ఆమె స్నేహితుల ప్రోత్సాహంతో పోటీల్లో పాల్గొని భారతీయ వనిత ప్రతిభను ఖండాంతరాలకు చాటిచెప్పింది.

Srisubha Addepalli wins Miss India South Africa Gauteng title

చిన్నప్పటినుంచి

చిన్నప్పటి నుంచి వివిధ రంగాల్లో శ్రీశుభ తన పత్రిభను చాటుతోంది. పాఠశాల స్థాయిలో నిర్వహించిన నృత్య పోటీలైనా ఎన్‌సీసీలో రైఫిల్ షూటింగ్‌ అయినా వ్యాసరచన, వక్తృత్వం, సంగీతం ఇలా పోటీ ఏదైనా తన సత్తాచాటి బహుమతులు అందుకుంది.

ఇలా వివిధ రంగాలతోపాటు చదువులో కూడా ముందువరసలోనే ఉండేది. అదే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సీటు తెచ్చిపెట్టింది. వివిధ రంగాల్లో ఆమె ప్రతిభతోపాటు శిక్షణ ఇచ్చిన గురువుల ప్రోత్సాహం కూడా విజయాలకు దోహదపడ్డాయి.

అమ్మకు వందనం

ప్రతి వ్యక్తి ఉన్నతిలో అమ్మ పాత్ర కీలకమైనది. శ్రీశుభ విజయంలో కీలకపాత్ర ఆమె తల్లి సుబ్బలక్ష్మిదే. పిల్లల చిన్నతనంలో తండ్రి దూరమైనా వారికి ఆ లోటు తెలియకుండా అన్ని రంగాల్లో ప్రోత్సహించింది.

చదువుతోపాటు పలు కళల్లో ప్రావీణ్యం సాధించిందంటే తల్లి ప్రోత్సాహమే కారణం. నృత్యశిక్షణకు తీసుకెళ్లడం, సంగీతానికి పంపించడం ఇలా అన్నిటా ఆమె పాత్ర ఉంది.

ఆ మూడు నిమిషాల ప్రదర్శన అద్భుతం

మూడు నిమిషాల సోలోప్రదర్శనలో ఆమె ప్రదర్శించిన తీరే ఆమెకు విజయాన్ని తెచ్చిపెట్టింది. తనతోపాటు పోటీపడిన 8 మంది సుందరీమణులను వెనక్కి నెట్టి ఆమె కిరీటం ధరించేలా చేసింది.

డిసెంబర్‌లో జరిగే దేశవ్యాప్త పోటీల్లో కూడా విజయం సాధించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నారు. శ్రీశుభ ఆపోటీల్లో కూడా విజయం సాధించి అంతర్జాతీయ స్థాయిలో కూడా విజయం సాధించాలని పట్టణవాసులు ఆకాంక్షిస్తున్నారు.

చాలాసంతోషంగా ఉంది: సుబ్బలక్ష్మి, తల్లి

'మా శుభ ఈ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. బంధుమిత్రులు కుటుంబసభ్యులతోపాటు పట్టణవాసులు వచ్చి అభినందిస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ విజయం తెలుగువారి అందరిదీ. నా అభిప్రాయం తనమీద ఎప్పుడూ రుద్దలేదు. తన ఆకాంక్ష తెలుసుకుని తల్లిగా నావంతు ప్రోత్సహించాను అంతే. తరువాత పోటీల్లో కూడా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం.' అని తల్లి అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Srisubha Addepalli, an IT specialist hailing from Andhra Pradesh, was crowned Miss India South Africa Gauteng 2017.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి