ఒంటరిగా మొదలై..ఉప్పెనగా మారి : జగన్ నాడు -నేడు మార్పు ఇదే : వైసీపీ 12 ఏళ్ల ప్రస్థానం..!!
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. నాడు విపత్కర పరిస్థితుల్లో పార్టీ ఏర్పాటు చేసి..నేడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే వరకూ ఎన్నో ఆటుపోట్లు. 16 నెలల జైలు జీవితం.. ఏడాదిన్నారకు పైగా పాదయాత్ర.. తొమ్మిదేళ్ల పోరాటం. ఫలితమే ముఖ్యమంత్రిగా జగన్ కు అవకాశం. తండ్రి మరణం తరువాత మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ ను వీడిన జగన్ తొలిగా తన తల్లితో కలిసి రాజకీయంగా అడుగులు వేసారు. తల్లి పులివెందుల ఎమ్మెల్యేగా.. తాను కడప ఎంపీగా రికార్డు మెజార్టీతో గెలుపొందారు. తండ్రి తరహాలో ప్రజాభిమానం నిలుపుకోవటంలో విజయవంతం అయ్యారు. అదే సక్సెస్ మంత్రంగా మారింది.

ప్రజాభిమానం.. అదే సక్సెస్ మంత్రం
అదే ఆయన వెంట ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు నడవటానికి.. ప్రజలు వెన్నంటి నిలవటానికి కారణమైంది. మార్చి 12, 2011న వైయస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయలోని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సమాది వద్ద ప్రారంభమైన పార్టీ నేడు ఏపీలో అధికారం లోకి వచ్చిన రెండో పార్టీగా రికార్డు సాధించింది. ఏకంగా 50 శాతానికి పైగా ఓట్లు..151 సీట్లు సాధించి జగన్ సీఎం అయ్యారు.
సీబీఐ విచారణలు..అక్రమాస్తుల ఆరోపణలు..ఎన్నో విమర్శలు...అన్నంటినీ తట్టుకొని పార్టీ ఏర్పాటు చేయటంతోనే కాదు. అధికారంలోకి తెచ్చేవరకూ విశ్రమించలేదు. పార్లమెంట్‌లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించే స్థాయికి ఎదిగింది. వైఎస్సార్ అంటే ఒక ప్రభంజనం. ఆ వారసత్వం కొనసాగిస్తూ..ప్రజా సమ్మోహన శక్తిని జగన్ సొంతం చేసుకున్నారు.

మాట ఇస్తే అమలు చేస్తారనే నమ్మకం
2014 ఎన్నికల్లోనూ కేవలం 1.95 శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యారు. నాడు ప్రతిపక్ష నేతగా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారు. చివరకు సభను బహిష్కరించి తన తండ్రి బాటలోనే పాదయాత్ర ప్రారంభించారు. 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర కొనసాగింది.
2019 మే 30న అధికారం చేపట్టి తన కలను సుసాధ్యం చేసుకున్నారు. ప్రమాణ స్వీకార వేదిక పైనే తల్లి విజయమ్మ తాము ఎదుర్కొన్న కష్టాలు..నాడు ముఖ్యమంత్రిగా భర్త వైఎస్సార్.. నేడు సీఎంగా కుమారుడిని చూసుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఇక, పాలన చేపట్టే సమయానికి భారీగా ఇచ్చిన హామీలు..పాలన సమయంలో ఎన్నో సవాళ్లు..జగన్ ను ముఖ్యమంత్రి హోదాలో ఉక్కిరి బిక్కరి చేసాయి.

రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు
కరోనా కారణంగా ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. అదే సమయంలో అమరావతితో సహా మరి కొన్ని నిర్ణయాలతో రాజకీయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అనేక నిర్ణయాల్లో న్యాయస్థానాల్లో వ్యతిరేక తీర్పులు వచ్చాయి. కానీ, జగన్ తాను తీసుకున్న నిర్ణయాల వైపే ముందుకు సాగారు. కానీ, కొంత కాలంగా జగన్ లో మార్పు కనిపిస్తోంది.
తనను గెలిపించిన ఓటర్లకు ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకొనేందుకు సీఎంగా జగన్ సక్సెస్ అవుతున్నారు. కానీ, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ తగ్గింది. పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుసగా విజయాలు దక్కాయి. కానీ, ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వటం లేదనే విమర్శలు ఉన్నాయి. పాలనలో మూడేళ్లు పూర్తయింది.

నాడు - నేడు అదే ప్రత్యర్ధుల లక్ష్యం
గతంలో ప్రతిపక్ష నేతగా నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించిన జగన్..ఇప్పుడు తన తండ్రి తరహాలో ప్రజలను తనను నేరుగా కలిసేందుకు అవకాశం ఇవ్వలేకపోయారు. ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తారని చెప్పినా..అమలు కాలేదు. నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకోవటం ..పరిష్కారం ద్వారానే వైఎస్సార్ నాడు ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కానీ, మూడేళ్లు అవుతున్నా..ప్రజలకు సీఎంతో కలిసే అవకాశం దక్కటం లేదు. పార్టీ నేతలు - కార్యకర్తలకు సమయం ఇవ్వటం లేదు. ప్రభుత్వం పైన వ్యతిరేక ప్రచారంలో ప్రతిపక్షాలు వేగంగా పావులు కదుపుతున్నాయి. వాటిని తిప్పి కొట్టటంలో వైసీపీ వెనుకబడి ఉందనే అభిప్రాయం కలుగుతోంది.
Recommended Video

జగన్ నుంచి కోరుకుంటుంది ఇదేనంటూ
ఇక, వివేకా హత్య కేసు..షర్మిల వ్యవహారం ద్వారా ఇప్పుడు ప్రతిపక్షాలు సీఎం జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయి. తన 13 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో సీఎం జగన్ ఎన్నో ఒడుదుడుకలను ఎదుర్కొన్నారు. అన్నింటినీ అధిగమించారు. కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో వస్తున్న ఆరోపణలు..సొంత పార్టీలో అంతర్గత వివాదాలు.. పాలనా పరంగా నిర్ణయాల్లో లోపాలు రానును రోజుల్లో పార్టీ పైనా..ప్రభుత్వం పైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక, జగన్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కోసం సమయం కేటాయించాల్సిన అవసరం నేతలు గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications