సమైక్యతను కోరలేదు: బొత్స, ఆంక్షలొద్దన్న దానం

ఉమ్మడి కుటంబం విడిపోతుందన్న బాధ తనకూ ఉందని బొత్స సత్యనారాయణ అన్నారు. తాను కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసిన వారందరూ ఏ పార్టీలో చేరతారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్రకు చెందిన ఏ పార్టీ సమైక్య రాష్ట్రాన్ని కోరిందో వారు చెప్పాలని అన్నారు.
మొదట అన్ని పార్టీలు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉండటంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా గురించి ప్రశ్నించగా స్పందించేందుకు బొత్స నిరాకరించారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని విషయాలపై మాట్లాడతానని చెప్పారు.
ఆంక్షలు వ్యతిరేకిస్తున్నాం: దానం
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌పై ఆంక్షలు విధించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఆయన హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌పై ఆంక్షలు విధించడం వల్ల పరిపాలన అడ్డంకులు ఎదురవుతాయని అన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి కోరుకునేవారు చాలా మంది ఉన్నారని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద తోపు కాదని, విజయభాస్కర్ లాంటి వాళ్లను ముఖ్యమంత్రులుగా చూశామని అన్నారు. మంత్రులకు తెలియకుండానే కిరణ్ కుమార్ రెడ్డి వారి శాఖలను మార్చాడని అన్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు నల్లారి సంతోష్ కుమార్ పైనా పలు విమర్శలు చేశారు. తాము కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు పాటిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications