పద్మావతి నిలయంపై యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశం
అమరావతి: తిరుపతిలోని శ్రీ పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌కు ఇచ్చే అంశంపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపి కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీపద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. భక్తుల విరాళాలతో వచ్చిన సొమ్ముతో పద్మావతి నిలయం ఏర్పాటు చేశారని, అలాంటి భవనాన్ని కలెక్టరేట్ కోసం కేటాయించడం సమంజసం కాదని, నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో ప్రజాప్రయోజ వ్యాజ్యం దాఖలైంది.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. కలెక్టరేట్ ఏర్పాటుకు ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై యథాతథస్థితి పాటించాలిన ఆదేశాలు జారీ చేసింది. భవనంలో ఎలాంటి మార్పులు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ మార్చి 29కి వాయిదా వేసింది.

కాగా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజక వర్గాలతో తిరుపతి కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న శ్రీబాలాజీ జిల్లాకు కలెక్టరేట్ సిద్ధమైంది. ఏప్రిల్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ జిల్లాకు సంబంధించి.. తాత్కాలికంగా ప్రభుత్వ శాఖల కార్యాలయాలను తిరుచానూరులోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక తాజాగా, శ్రీబాలాజీ జిల్లా కలెక్టరేట్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు అధికారులు సంబంధిత మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తున్నారు.
పద్మావతి నిలయంలో కలెక్టరేట్ మాత్రమే ఏర్పాటు చేయాలని అధికారులు ముందుగా నిర్ణయించారు. ఇక్కడ 200 వరకు గదులు ఉండగా, ప్రతి గది కూడా విశాలంగా ఉండటంతో.. వివిధ శాఖలకు చెందిన జిల్లా కార్యాలయాలనూ పద్మావతి నిలయంలోనే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఇందుకు సంబంధించిన విచారణ జరగడం.. హైకోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించడంతో అధికారులు తమ చర్యలను నిలిపివేశారు.












Click it and Unblock the Notifications