Nagarjunasagar Dam: నీటిని తీసుకోవటం ఆపండి: ఏపీ సర్కార్ కు కృష్ణాబోర్డు లేఖ!!
కృష్ణా జలాల వివాదం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దుమారం రేపుతుంది. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దౌర్జన్యంగా నీటిని తీసుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. నిన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఏపీ పోలీసులు నాగార్జునసాగర్ డ్యాం పైకి వచ్చి నీటిని విడుదల చేయడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది.
ఎట్టకేలకు ఏపీ పోలీసులు కృష్ణా జలాలను విడుదల చేశారు. ఆంధ్ర భూభాగంలో ఉన్న సాగర్ డ్యాం పై 13 గేట్లను ఆక్రమించిన ఏపీ పోలీసులు వాటిని తమ అధీనంలోకి తీసుకొని భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ పోలీసులు ఏపీ పోలీసులపై కేసు నమోదు చేశారు.

అక్రమంగా తమ భూభాగంలోకి చొరబడ్డారు అని వారిపై కేసులు నమోదు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏపీ నీటిని విడుదల చేయడంపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. నీటి విడుదల ఇలాగే కొనసాగితే ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కు చేరే అవకాశం ఉందని కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కృష్ణ బోర్డు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలని ఆదేశాలు జారీ చేస్తూ లేఖ రాసింది. ఏపీ రాసిన లేఖలో అక్టోబర్ నెల కోసం అడిగిన ఐదు టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టిఎంసిల నీటిని విడుదల చేసినట్టు లేఖలో పేర్కొంది. నవంబర్ 30వ తేదీ తర్వాత నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేసింది.
నీటి కోసం ఎటువంటి విజ్ఞప్తి లేకుండా నీటిని విడుదల చేయడం కరెక్ట్ కాదని పేర్కొన్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ వెంటనే ఏపీ ప్రభుత్వం నీటి విడుదలను ఆపాలని లేఖ ద్వారా స్పష్టం చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తాము చేసిన పనిని సమర్థించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.
ప్రస్తుతం నాగార్జునసాగర్ డ్యాం వద్ద ఏపీ, తెలంగాణ అధికారులు చర్చలు జరుపుతున్నారు. దీనిపైన కేంద్రం కూడా దృష్టి సారించింది. మరోవైపు కృష్ణ బోర్డు అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని కూడా సమీక్షించారు. ఈ క్రమంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఏం చేయబోతున్నాయి అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications