లడ్డూ వివాదంలో బిగ్ ట్విస్ట్ లు-సుప్రీంలో చంద్రబాబుపై సుబ్రమణ్యస్వామి, వైవీ పిటిషన్లు..!
వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిపాలంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఇవాళ చంద్రబాబు వ్యాఖ్యలపై చర్యలు కోరుతూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై త్వరలో విచారణ జరగనుంది.
తిరుమల లడ్డూపై చంద్రబాబు ఆధారాలు లేని ఆరోపణలు చేసారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. వీటిపై విచారణ కమిటీ వేసి నిగ్గు తేల్చాలని పిటిషన్లో స్వామి కోరారు. చంద్రబాబు శ్రీవారి లడ్డూపై చేసిన ఆరోపణల్ని ఆందులో ప్రస్తావించారు. ఇందులో వాస్తవాలు లేవంటూ తెలిపారు. కాబట్టి సమగ్ర విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. దీనిపై సుప్రీంకోర్టు త్వరలో విచారణ జరపబోతోంది.

మరోవైపు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా సుప్రీంకోర్టులో ఇలాంటి పిల్ దాఖలు చేశారు. చంద్రబాబు తిరుమల లడ్డూపై చేసిన విమర్శలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్డీతో కానీ నిపుణుల కమిటీతో కానీ విచారణ చేయించాలని వైవీ సుబ్బారెడ్డి ఈ పిటిషన్ లో కోరబోతున్నారు. ఇందులో సుబ్బారెడ్డి చంద్రబాబు వ్యాఖ్యల ద్వారా తిరుమల ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని, కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు.
తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చి జగన్ ను టార్గెట్ చేస్తున్న కూటమి వైఖరిపై ఇప్పటికే వైసీపీ నేతలు మండిపడుతున్నారు. దీంతో ఈ వివాదాన్ని కోర్టుల ద్వారా సాధ్యమైనంత త్వరగా నిగ్గు తేల్చాలని భావిస్తున్నారు. దీంతో నేరుగా సుప్రీంకోర్టునే ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా చంద్రబాబు వ్యాఖ్యలకు ఆధారాలు లేవని పిటిషన్ లో పేర్కొనడం సంచలనం రేపుతోంది.












Click it and Unblock the Notifications