వైయస్ ఫ్యామిలీలో మారుతున్న సమీకరణాలు..ఎవరు ఎవరివైపు..?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. రాజకీయంగా కొత్త నేతల ఎంట్రీకి రంగం సిద్దమవుతోంది. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఉన్న ఇమేజ్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సారి ఎన్నికల్లో వైఎస్ కుటుంబం నుంచి యువ నేతలు పొలిటికల్ ఎంట్రీకి సిద్దం అవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు మద్దతుగా జిల్లాలో పార్టీకి పని చేసేందుకు ముందుకొస్తున్నారు. వీరిలో కొందరు సీట్లు ఆశిస్తున్నవారు ఉన్నారు. ముఖ్యంగా పులివెందుల కేంద్రంగా టీడీపీ..వైసీపీలో కొత్త రాజకీయం మొదలైంది.
వైఎస్ కుటుంబం నుంచి వారసులు: కడప జిల్లా పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. పులివెందులలో ఈ సారి టీడీపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. వైఎస్ కుటుంబం నుంచే అక్కడ ఒకరిని పార్టీ అభ్యర్ధిగా బరిలో దింపాలనేది టీడీపీ ఆలోచన. సాధ్యపడకుంటే కడప ఎంపీగా వైఎస్ సునీతతో పోటీ చేయించే ప్రయత్నాలు సాగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రి జగన్ తన నియోజవకర్గంలో సమస్యల పరిష్కారానికి.. పార్టీ వ్యవహారాలను ఎంపీ అవినాష్ కు అప్పగించారు. అవినాష్ అక్కడ ప్రజాదర్బార్ నిర్వహిస్తూ స్థానిక సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికల సీజన్ ప్రారంభం కావటంతో వైఎస్ ఫ్యామిలీలోని వారసులు తెర పైకి వచ్చారు. నేరుగా ప్రత్యక్ష రాజకీయాలపైన ఆసక్తి చూపిస్తున్నారు.

పులివెందుల కేంద్రంగా రాజకీయం: వైఎస్ అవినాష్ రెడ్డితో పాటుగా వైఎస్ భాస్కరెడ్డి పులివెందులలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. వివేకా కేసు..అవినాష్ పైన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు డాక్టర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు. భాస్కరరెడ్డి అన్న ప్రకాశ్ రెడ్డి కుమారుడు వైఎస్ మదన్‌మోహన్‌రెడ్డి తనయుడు డాక్టర్ అభిషేక్ రెడ్డి. 2019 ఎన్నికల సమయంలోనూ అభిషేక్ రెడ్డి రాజకీయంగా తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం విశాఖలో ఉంటున్నారు. వృత్తిరీత్యా డాక్టర్. ఈయన భార్య కూడా డాక్టరే. అభిషేక్‌రెడ్డికి ప్రస్తుతం నియోజకవర్గంలోని సింహాద్రిపురం, లింగాల మండలాల వైసీపీ బాధ్యతలు కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల కోసం నియోజకవర్గంలో ఇప్పటి నుంచే పని చేసేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ గతంలో ప్రచారం సాగినా..ఇప్పుడు పార్టీ కోసం అప్పగించిన బాధ్యతలు నిర్వహించటానికి సిద్దంగా ఉన్నారని సమాచారం.

జగన్ గెలుపు కోసం రంగంలోకి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు దుష్యంత్ రెడ్డి సోదరుడు వరుస అవుతారు. కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలం తాటిమాకులపల్లె దుష్యంత్ రెడ్డి స్వగ్రామం. ముఖ్యంగా కమలాపురం, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో అతని గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. 2019లో జమ్మలమడుగు నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులయ్యారు. 2009లోనే దుష్యంత్ రెడ్డి కమలాపురం టికెట్ ఆశించారు. ఈసారి అతనికి టికెట్ తప్పకుండా వస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే అది కడప ఎంపీ టికెట్ దక్కనుందనే చర్చ జరుగుతోంది. పారిశ్రామికవేత్త అయిన యువనాయుకుడు కావడం వల్ల పార్టీకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో కమలాపురం నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగారు. వీరశివారెడ్డికి వైఎస్సార్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఈ సారి ఆయనే ఎన్నికల బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications