పెళ్లికి రండి: చంద్రబాబు కుటుంబంతో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు వియ్యం
హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు కుటుంబంతో సినీ హీరో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు బంధుత్వం అందుకోబోతున్నారు. చంద్రబాబు సోదరి హైమావతి మనవరాలు ప్రియాంకతో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కుమారుడు రత్నబాబుల పెళ్లి ఖరారైంది.
ఈ మేరకు ఇరు కుటుంబాలు ఇప్పటికే ముహూర్తాలను కూడా నిర్ణయించుకున్నాయి. ఆదివారం హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో ఆయన్ని కలిసిన సూపర్ స్టార్ కృష్ణ, ఆదిశేషగిరిరావు వివాహా ఆహ్వాన పత్రికను అందజేసి పెళ్లికి రావాలని ఆహ్వానించారు.
ప్రియాంక ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేయగా, రత్నబాబు ఇప్పటికే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వ్యాపారం రంగంలో ఉన్నారు. కృష్ణ తన పెద్ద కూతురు పద్మజను వ్యాపార రంగంలోనే కాక రాజకీయ రంగంలోనూ కీలక భూమిక పోషిస్తున్న గల్లా అరుణకుమారి కుమారుడు, ప్రస్తుతం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు.

ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు చంద్రబాబుతో నారా లోకేశ్ కూడా!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. టీడీపీ చేపట్టిన జనచైతన్య యాత్రల్లో భాగంగా ఈరోజు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరగనున్న కార్యక్రమాలకు చంద్రబాబు హాజరుకానున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు తెలిపారు.
ముందుగా శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్న చంద్రబాబు పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరులో నిర్వహించనున్న జనచైతన్య యాత్రలో పాల్గొని, అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడతారని తెలిపారు. అనంతరం విజయనగరం జిల్లా వెళ్లనున్న చంద్రబాబు ఎస్. కోట నియోజకవర్గ పరిధిలోని లక్కవరపుకోటలో జనచైతన్య యాత్రలో పాల్గొంటారని చెప్పారు.
కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళుతున్నారని తెలిసింది. విశాఖపట్నం జిల్లాలోని చీడికాడలో జరగనున్న జనచైతన్య యాత్రకు హాజరుకానున్న లోకేశ్, అక్కడ ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఈ పర్యటనల అనంతరం చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ కూడా నేరుగా విజయవాడ చేరుకుంటారు.












Click it and Unblock the Notifications