హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ రద్దు
జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని న్యాయస్థానం తెలిపింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని సుప్రీంకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ప్రస్తుత కమిటీ స్థానంలో ఏకసభ్య కమిటీని నియమించింది. ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాలన్నీ కొత్త కమిటీ చూసుకుంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీకోర్టు నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ ఎన్నికలు జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో నిర్వహించాలని సీనియర్ న్యాయవాది సిద్దార్థ దవే కోర్టును కోరారు. హెచ్‌సీఏలో అసలైన ఓటర్లను ఆయన ఎంపిక చేయగలుగుతారని పేర్కొన్నారు.
గతంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) కోసం ఎలక్టోరల్ కాలేజీని ఖరారు చేసే ప్రక్రియను జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యవేక్షించారని, ఇప్పటికీ ఐఓఏ ముసాయిదా రాజ్యాంగాన్ని పర్యవేక్షిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని న్యాయస్థానం తెలిపింది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పలు వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ సందర్భంగా అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. టికెట్ల కోసం సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భారీ సంఖ్యలో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. అంతేకాకుండా 55వేల సీటింగ్ కెపాసిటీ ఉంటే అమ్మకానికి చాలా తక్కువ సంఖ్యలో టికెట్లు పెట్టి అయిపోయాయని ప్రకటించారనే విమర్శలు వచ్చాయి.
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను నడిపిస్తున్నారు. వివాదాలతో సహవాసం చేస్తున్న అజారుద్దీన్ రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసి తొక్కిసలాట సందర్భంగా జరిగిన పరిణామాలను వివరించారు. తాజాగా సుప్రీంకోర్టు కమిటీని రద్దుచేయడంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీపరులను నియమించి పారదర్శకంగా పాలన సాగేలా చూడాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications