ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు..!!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు ఖరారయ్యారు. ఈ మేరకు ఇద్దరు పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం వారితో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు నూతన సీజేల పేర్లను ప్రతిపాదించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించాలని సూచించింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పీకే మిశ్రా మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవ్వడంతో రాష్ట్రంలో ఖాళీ ఏర్పడింది. జమ్మూకశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2013లో అదే రాష్ట్ర హైకోర్టులో తొలుత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయనను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో కొలీజియం సిఫారసు చేసినా కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచింది.

అయితే, మణిపూర్ హైకోర్టు సీజేగా నియమించాలన్న సిఫారసును మార్చి, ఆయనను ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించాలని కొలీజియం బుధవారం కేంద్రానికి తాజా సిఫారసు పంపింది. మరోవైపు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరధేను తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ అలోక్ 2009 డిసెంబరులో అదే రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులను సుప్రీం న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ , కేరల్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్ ఉన్నారు. సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34 కాగా, ప్రస్తుతం 31 మంది పని చేస్తున్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందువల్ల కోర్టులో ఇప్పటికే పెండింగ్ లో ఉన్న కేసులతో పాటుగా తాజాగా దాఖలయ్యే వాటి విచారణ కోసం న్యాయమూర్తుల సంఖ్యను పూర్తి స్థాయికి తీసుకెళ్లేందుకు వీలుగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత సుప్రీంకోర్టు కొలీజియం తాజా నియామకాల కు సిఫార్సులు చేసింది.












Click it and Unblock the Notifications