ఏపీ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్, ఇద్దరు న్యాయమూర్తులు: తెలంగాణ జడ్జి బదిలీ: కంప్లీట్ లిస్ట్ ఇదే
అమరావతి: దేశవ్యాప్తంగా 13 హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించింది సుప్రీంకోర్టు కొలీజియం. ఇందులో అయిదు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు స్థానం చలనాన్ని కల్పించగా.. మిగిలిన ఎనిమిదింటికీ కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించింది. ఈ 13 హైకోర్టుల్లో ఏపీ, తెలంగాణ కూడా ఉన్నాయి. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రఫుల్ల కుమార్ మిశ్రాను నియమించింది. ఇదివరకు న్యాయమూర్తిగా పని చేసిన ఆయనను చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి కల్పించి- ఏపీ హైకోర్టుకు పంపించింది.

తెలంగాణకు కొత్త చీఫ్ జస్టిస్..
తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయనకు కూడా ఇది పదోన్నతే. కొత్తగా ప్రమోషన్ పొంది.. వేర్వేరు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా అపాయింట్ అయ్యారు. జస్టిస్ రాజేష్ బిందాల్-అలహాబాద్, జస్టిస్-ప్రకాష్ శ్రీవాస్తవ, జస్టిస్ ప్రఫుల్ల కుమార్ మిశ్రా-ఆంధ్రప్రదేశ్, జస్టిస్ రీతూరాజ్ అవస్థి-కర్ణాటక, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ-తెలంగాణ, జస్టిస్ అరవింద్ కుమార్-గుజరాత్, జస్టిస్ రవి విజయ్ కుమార్ మలిమత్-మేఘాలయా నియమితులయ్యారు. వారందరూ కొత్తగా చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు.

ఛత్తీస్‌గఢ్‌కు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్..
కాగా- మరో అయిదు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. జస్టిస్ అకిల్ ఖురేషీని త్రిపుర నుంచి రాజస్థాన్‌కు, జస్టిస్ ఇంద్రజిత్ మహంతిని రాజస్థాన్ నుంచి త్రిపురకు బదిలీ చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహమ్మద్ రఫిక్ హిమాచల్ ప్రదేశ్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార గోస్వామి.. ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ అయ్యారు. జస్టిస్ బిశ్వనాథ్ సొమద్దర్‌ను మేఘాలయా నుంచి సిక్కింకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.

17 న్యాయమూర్తులకూ
అలాగే- దేశవ్యాప్తంగా 17 మంది న్యాయమూర్తులకు స్థాన చలనం కలిగింది. వారందరూ వేర్వేరు హైకోర్టులకు బదిలీ అయ్యారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే- సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు కూడా కొలీజియం సిఫారసుల జాబితాలో ఉన్నాయి. ఈ బదిలీల సందర్భంగా- ఏపీ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. అలాగే- తెలంగాణ హైకోర్టు నుంచి ఓ న్యాయమూర్తి బదిలీపై మరో రాష్ట్రానికి వెళ్తారు.

సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలోని కొలీజియం..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని కొలీజియం ఈ మేరకు సిఫారసులను జారీ చేసింది. దీని ప్రకారం- ఏపీ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. జస్టిస్ రవినాథ్ తిల్హారి, జస్టిస్ ఎహసనుద్దీన్ అమానుల్లా ఏపీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం జస్టిస్ రవినాథ్ తిల్హారీ.. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తోన్నారు. అలాగే- జస్టిస్ ఎహసనుద్దీన్ అమానుల్లా- పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. వారిద్దరూ ఇక ఏపీ హైకోర్టుకు రానున్నారు.

పంజాబ్ అండ్ హర్యానాకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి..
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తోన్న జస్టిస్ ఎంఎస్ఎస్ రామచంద్ర రావు బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ సిఫారసులను జారీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. కాగా- దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న వేర్వేరు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల బదిలీల జాబితా పూర్తి వివరాలను ఇలా ఉన్నాయి.

వేర్వేరు రాష్ట్రాలకు..
రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సబీనా హిమాచల్ ప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎం బాదర్ పాట్నా హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వివేక అగర్వాల్‌ను సుప్రీంకోర్టు కొలీజియం మధ్యప్రదేశ్‌కు బదిలీ చేసింది. అదే హైకోర్టులో పని చేస్తోన్న న్యాయమూర్తి జస్టిస్ చంద్రధారి సింగ్‌ను ఢిల్లీ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేసింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూప్ చిత్కారా.. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ అయ్యారు.

బోంబే హైకోర్టు నుంచి తెలంగాణకు
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సిఫారసులను జారీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివజ్ఞానం కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ రాజస్థాన్‌కు, కలకత్తా హైకోర్టు జస్టిస్ అరిందమ్ సిన్హా ఒరిస్సా హైకోర్టుకు బదిలీ అయ్యారు. బోంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను తెలంగాణకు బదిలీ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.

ఒరిస్సా నుంచి ఉత్తరాఖండ్‌కు
పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జశ్వంత్ సింగ్‌ను ఒరిస్సాకు బదిలీ చేసింది. ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ కుమార్ మిశ్రాను ఉత్తరాఖండ్ హైకోర్టుకు ట్రాన్స్‌ఫర్ చేసింది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమెన్ సేన్ కూడా ఒరిస్సాకు బదిలీ అయ్యారు. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పరేష్ ఆర్ ఉపాధ్యాయ.. మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ కొలీజియానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వాన్ని వహిస్తున్నారు. అయిదుమంది సభ్యులు ఉన్న కొలీజియం ఇది. జస్టిస్ లావు నాగేశ్వరరావుతో పాటు మరో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ అజయ్ మాణిక్ రావు ఖన్విల్కర్, జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ ఇందులో సభ్యులుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications