తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం ఫైర్- చంద్రబాబు తీరుపై ఆక్షేపణ-ప్రశ్నల వర్షం ..!
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డూ వివాదాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చిన తీరుపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా సీఎం హోదాలో చంద్రబాబు లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చిన విధానంపై పిటిషనర్లు సుప్రీంకోర్టులో అభ్యంతరం తెలిపారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాజకీయాల నుంచి దేవుడిని దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా రాజకీయాలకు, మతానికి మధ్య ఉండాల్సిన దూరాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తుచేసింది.
మరోవైపు తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో చేపనూనె, జంతువుల కొవ్వు, పందికొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును సీఎం చంద్రబాబు విడుదల చేసిన సమయాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది.అలాగే దీనిపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. అలాగే నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని కూడా ప్రశ్నించింది. లడ్డూల్ని ముందే పరీక్షలకు ఎందుకు పంపలేదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మైసూరు లేదా ఘజియాబాద్ ల్యాబ్ ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని ఆక్షేపించింది.
నెయ్యి కల్తీపై సుప్రీం ప్రశ్నల వర్ధం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా స్పందిస్తూ భక్తుల నుంచి ఫిర్యాదులు రావడం వల్లే దీనిపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నెయ్యి కల్తీ సంస్థ గతంలో నాలుగు ట్యాంకర్లు సరఫరా చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంపై విచారణ కాకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటనలు చేస్తారని సుప్రీంకోర్టు నిలదీసింది. అంతే కాదు ప్రస్తుత సిట్ దర్యాప్తు కొనసాగాలా లేక మరో దర్యాప్తు చేపట్టాలా అన్న అంశంపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయం తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై అక్టోబర్ 3న తదుపరి విచారణ చేపట్టాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications