జగన్ బెయిల్ రద్దుపై కాసేపట్లో సుప్రీం నిర్ణయం..!
ఏపీలో సీఎం వైఎస్ జగన్ కు అక్రమాస్తుల కేసులో గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ తో పాటు ఆయన కేసుల్ని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పైనా సుప్రీంకోర్టు ఇవాళ కీలక విచారణ జరపబోతోంది. ఈ విచారణలో సుప్రీంకోర్టు వెలువరించే ఆదేశాలు సీఎం జగన్ పై నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఎన్నికల వేళ ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.

సీఎం వైఎస్ జగన్ కు గతంలో అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత ఐదేళ్లుగా ఆయన వివిధ కారణాలతో కోర్టు విచారణలకు హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసుల్ని తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది.
మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఊపందుకుంది. ఇప్పటికే సీఎం జగన్ మేమంతా సిద్ధం సభల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు సానుకూలంగా ఉంటే ఎన్నికల సమయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. ప్రతికూలంగా వస్తే మాత్రం సమస్యలు తప్పవు. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నానికి సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే అవకాశముంది.












Click it and Unblock the Notifications