చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై సుప్రీం తాజా నిర్ణయం...!!
ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడి కానుంది. ఇప్పటికే ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. చంద్రబాబు పైన సీఐడీ వరుసగా నమోదు చేసిన కేసుల్లో ఈ తీర్పు కీలకం కానుంది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు, సీఐడీ తరపు హోరా హోరీ వాదనలు జరిగాయి. ఈ నెల 16న ఈ కేసులో తీర్పు వెల్లడికానుంది.
క్వాష్ పిటీషన్ : తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై సీఐడీ స్కిల్ కేసులో అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు రాజమండ్రి జైలులో 53 రోజులు ఉన్నారు. అనారోగ్య కారణాలతో హై కోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తరువాత సీఐడీ వరుసగా చంద్రబాబు పైన ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక, లిక్కర్ కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లోనే హైకోర్టు ముందస్తు బెయిల్ కు అంగీకరిస్తూ కొన్ని షరతులు విధించింది. ఇక...జైలులో ఉన్న సమయంలోనే ముందుగా హైకోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. అక్కడ ఈ పిటీషన్ ను తిరస్కరించారు. దీంతో, చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

17-ఏ కేంద్రంగా వాదనలు : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో తన పేరుని కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సెక్షన్ 17-ఏ పై చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. సుదీర్ఘ విరామం తరువాత ఈ నెల 17న ఈ కేసులో తీర్పు వెలువరిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ కేసులో ప్రధానంగా 17-ఏ కేంద్రంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు అరెస్ట్ సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదని.. చంద్రబాబుకు 17A కింద చంద్రబాబుకి రక్షణ కల్పించాలని వాదరించారు. రాజకీయ ప్రత్యర్థులైనందు వల్లే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని..చంద్రబాబు వ్యవహారంలో 17ఏ వర్తిస్తుందని న్యాయస్థానంలో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.

తీర్పుపై ఉత్కంఠ : ఇదే సమయంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ముఖుల్ రోహిత్గీ 17ఏ చంద్రబాబుకు వర్తించదని వాదించారు. దీంతో, రెండు వైపుల సుప్రీం వాదనలు విన్నది. అక్టోబర్ 20వ తేదీన తుది విచారణ జరిపి తీర్పును సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్‌నెట్ కేసు విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. 17Aపై తీర్పు తర్వాత ఫైబర్‌నెట్ కేసు విచారణ చేపడతామని.. అంతవరకూ చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక..ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సుప్రీం ఈ కేసులో ఈ నెల 16న ఇచ్చే తీర్పు పైన రాజకీయంగానూ ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications