చివరి అంకానికి నిమ్మగడ్డ వ్యవహారం: మరో మూడు రోజుల్లో: సుప్రీంలో: చీఫ్ జస్టిస్ సారథ్యంలో!
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మరోసారి చర్చల్లోకి రాబోతోంది. వార్తల్లోకి ఎక్కబోతోంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ లిస్టింగ్ అయింది. ఈ నెల 10వ తేదీన ఈ పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది.

చీఫ్ జస్టిస్ సారథ్యంలో..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ స్పెషల్ లీవ్ పిటీషన్‌ను విచారించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలను వినిపించనున్నారు. ఇదే కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యురో సభ్యుడు వర్ల రామయ్య పిటీషన్లను దాఖలు చేశారు.
సీఆర్డీఏ పరిధిలో మరో అధికారిణిపై సస్పెన్షన్ వేటు: ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కించపరిచేలా

కెవియట్లన్నింటినీ ఒకే పిటీషన్‌గా
వాటన్నింటినీ జోడించి, ఒకే పిటీషన్ కింద సుప్రీంకోర్టు విచారణ చేపట్టబోతోంది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించడానికి వీలుగా హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుకూలంగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి ప్రతికూలంగా వారంతా వేర్వేరుగా కెవియట్లను దాఖలు చేశారు. తమకు సూచన ఇవ్వకుండా సుప్రీంకోర్టు.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఎలాంటి ఆదేశాలను ఇవ్వకూడదనేది వారి వాదన.

రాజకీయాలతో పెనవేసుకున్న నిమ్మగడ్డ వ్యవహారం
నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారంలో పరస్పర భిన్నాభిప్రాయాలు, భిన్న సిద్ధాంతాలు కలిగిన మూడు పార్టీలు ఏకం అయ్యాయి. దీన్నిబట్టి చూస్తే.. ఈ వ్యవహరాం అంతా రాష్ట్ర రాజకీయాలతో ఏ రకంగా పెనవేసుకుని పోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల మధ్య రమేష్ కుమార్ భవితవ్యం ఏమిటనేది సుప్రీంకోర్టు తేల్చేయబోతోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సంస్కరణలను తీసుకుని వచ్చేలా జగన్ సర్కార్ చేపట్టిన చర్యల భవిష్యత్తు ఎలా ఉండబోతోందనేది కూడా సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పుపైనే ఆధారపడి ఉంది.

తేలనున్న రమేష్ కుమార్ భవితవ్యం..
ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఎఎస్ అధికారులను నియమించకూడదని, కమిషనర్ కాల పరిమితిని అయిదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సహా పలువురు ప్రముఖులు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేయడంతో అసలు కథ మొదలైంది. రమేష్ కుమార్‌ను అర్ధాంతరంగా తొలగించడంపై రాజకీయ పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని విభేదించడం ట్విస్ట్.

సంస్కరణల వైపా? లేక..
రమేష్ కుమార్ తొలగింపు, ఆయన స్థానంలో మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ నియామకం, దీనికి అవసరమైన ఆర్డినెన్స్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జారీ చేయడం, హైకోర్టు దాన్ని కొట్టేయడం వంటి వరుస పరిణామాలతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సంస్కరణల వైపు మొగ్గు చూపుతుందా? లేక హైకోర్టు తీర్పును సమర్థిస్తుందా అనేది తేలాల్సి ఉంది.