ఇప్పటం గ్రామస్థులకు సుప్రీంకోర్టు షాక్-పవన్ ను నమ్మి అలా.. !
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వార్తల్లోకి వచ్చిన గ్రామం ఇప్పటం. గుంటూరు జిల్లా మంగళగిరికి సమీపంలో ఉన్న ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు స్థలం కోరడంతో గ్రామస్థులు ఇచ్చారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ఇది మంటపుట్టించింది. దీంతో ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాలతో ప్రారంభించి రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టి ఇళ్ల గోడల కూల్చివేతలకు దిగారు. దీంతో ఇప్పటం గ్రామస్థులు పవన్ కళ్యాణ్ మద్దతు కోరారు. వారికి మద్దతుగా రంగంలోకి దిగిన పవన్ గ్రామంలోనే ఆందోళన చేపట్టారు.
ఆ తర్వాత ఇప్పటం గ్రామస్థులు ప్రభుత్వం తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చేస్తోందంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కూల్చివేతలు ఆపాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం తాము ఇప్పటం గ్రామస్థులకు ఇచ్చిన నోటీసుల వివరాలను హైకోర్టుకు సమర్పించింది. దీంతో ఇప్పటం గ్రామం నుంచి పిటిషన్లు దాఖలు చేసిన 14 మంది గ్రామస్థులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి తలో లక్ష రూపాయల జరిమానా విధించింది.

దీన్ని సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఇప్పటం గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలపై సమగ్రంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు జరిమానా విధించడాన్ని సమర్దించింది. అయితే జరిమానా మొత్తం తగ్గిచాలన్న పిటిషన్ల అభ్యర్ధనను మాత్రం అంగీకరించింది. దీంతో హైకోర్టు విధించిన లక్ష రూపాయల స్ధానంలో తలో పాతిక వేలు జరిమానాగా కట్టాలని తీర్పు ఇచ్చింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ మద్దతుతో వాస్తవాలు చూసుకోకుండా కోర్టులకే తప్పుడు సమాచారం ఇచ్చిన ఇప్పటం గ్రామస్థులు ఇప్పుడు జరిమానా కట్టక తప్పని పరిస్ధితి వచ్చింది.












Click it and Unblock the Notifications