కొమురం భీమ్‌ను చంపిన నిజాం గొప్పవాడా: కెసిఆర్‌పై సురవరం
హైదరాబాద్: నిజాం నవాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు మాట్లాడిన తీరు సరికాదని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కొమరం బీమ్‌ను చంపిన నిజాంను ఎలా పొగుడుతారని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్య్ర సమర యోధులను, తెలంగాణ సాయుధ పోరాట యోధులను హత్య చేసిన రజాకార్లకు మద్దతు ఇచ్చిన నిజాంను ఏ ప్రాతిపదికన పొగుడుతారని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజలను కడు పేదలుగా చేసి తాను అత్యంత సంపన్నుడిగా ఎదిగినందుకు పొగడాలా అని అన్నారు. ప్రపంచంలో ముస్లింలకు రాజు కావాలన్న ఆలోచనతోనే నిజాం నవాబు కొన్ని అభివృద్ధి పనులు చేశారని, ఖర్చు పెట్టిన ప్రతి చోటా తన పేరే పెట్టుకున్నారని ఆయన అన్నారు. సిఎం స్థాయి వ్యక్తి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేయడం హేయమైన చర్య అని సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రణాళికా సంఘం రద్దయితే పిఎం కార్యాలయం చుట్టూ ముఖ్యమంత్రులు చెప్పులు అరిగేలా తిరగాల్సిందేనని అన్నారు. మత మార్పిడుల ద్వారా సమాజంలో ఇబ్బందులు తప్పవని చెప్పారు. ప్లానింగ్ కమిషన్ స్థానే ఏర్పాటు చేసిన కొత్త సంస్థ విధాన రూపకల్పనలో కార్పొరేట్ శక్తులకు సహాయ పడుతూ రాష్ట్రాల పట్ల వివక్ష ప్రదర్శించే ప్రమాదం ఉందని అన్నారు.
కొత్త ఏడాది మొదటి రోజునే కేంద్ర ప్రభుత్వం ప్రజలతో పరిహాసం ఆడిందని అన్నారు. ఆర్ధిక ద్రవ్య లక్ష్యాల పట్ల ఇదే విధమైన స్వల్పకాలిక దృక్పథాన్ని నార్త్ బ్లాక్ లేక ఆర్ధిక మంత్రిత్వశాఖ అనుసరిస్తే అది కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య తగాదాలను పెంచుతోందని అన్నారు. నీతి అయోగ్ పేరిట పేరు మార్చడం ద్వారా ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి సందేశం పంపించాలని అనుకుంటోందని నిలదీశారు. కొత్త సంస్థ వల్ల ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థం అవుతుందని అన్నారు. నియంత్రణ అనేది లేకుండా పోతుందని చెప్పారు. పూర్తి స్థాయి మార్కెట్ ఆర్ధిక వ్యవస్థను ప్రవేశపెట్టడమే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications