సర్వే: జగన్, కెసిఆర్‌లకు బాబు షాక్!, మోడీతో బిజెపి 2
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు జరిగిన పలు సర్వేల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని తేలాయి. తాజా ఓ సర్వేలో తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ-ఎలక్షన్స్ సర్వేలో తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు టిడిపి షాక్ ఇచ్చే ఫలితం వచ్చింది. రానున్న ఎన్నికల్లో పదిహేను స్థానాల్లో గెలుపొందాలని తెరాస, 30 స్థానాల్లో గెలుపొందాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లెక్కలు వేసుకుంటోంది.
అయితే క్రమంగా జనాల మూడ్ మారుతున్నట్లుగా ప్రస్తుత సర్వే ద్వారా తెలుస్తోందంటున్నారు. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన ఈ వర్చువల్ ఓటింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 47049 మంది పాల్గొనగా.. 24,985 ఓట్లతో (53.1%) టిడిపి అగ్రభాగంలో నిలిచింది. 10,950 ఓట్లతో అనూహ్యంగా బిజెపి రెండో స్థానం దక్కించుకుంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 6,382 (13.6%) ఓట్లు, తెలంగాణ రాష్ట్ర సమితికి 2,335 (5%) ఓట్లు వచ్చాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంద్రుల ఆగ్రహాన్ని చవిచూస్తున్న కాంగ్రెస్ పార్టీ కేవలం 932 ఓట్లతో (2 శాతం)తో ఐదో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు తెలంగాణలో మాత్రమే బిజెపికి పట్టుందని భావించారు. అయితే నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ సీమాంధ్రలో కనిపించడంతో అక్కడ కూడా అనూహ్యంగా పుంజుకొని రెండో స్థానం దక్కినట్లు చెబుతున్నారు. అదే సమయంలో నిన్నటి వరకు సర్వేల్లో వెనుకబడిన టిడిపి ఇప్పుడు ముందుకు రావడానికి ప్రజల్లో క్రమంగా మార్పు కనిపించడమే అంటున్నారు.
మరోవైపు త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో (ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్) బిజెపి గెలుస్తుందని ఇండియాటుడే-ఓఆర్‌జీ ఒపీనియన్‌పోల్‌లో తేలింది. మిజోరంలో మాత్రం సర్వే నిర్వహించలేదు. సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లో 60 శాతం ఓటర్లు తమ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మళ్లీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 240 అసెంబ్లీ సీట్లు ఉన్న ఈ రాష్ట్రంలో బిజెపి 140 సీట్లు గెలవబోతోందని సర్వే నివేదిక పేర్కొంది.
ఛత్తీస్‌గఢ్‌లో 56 శాతం ఓటర్లు ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు మూడోసారి పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపారు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బిజెపితో పోటాపోటీగా ఉంది. సర్వే ఫలితాల ప్రకారం ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలోని 90 సీట్లలో 46 సీట్లు బిజెపి, 42 సీట్లు కాంగ్రెస్‌పార్టీ దక్కించుకోనున్నాయి. రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ సీట్లకుగాను 120 సీట్లు బిజెపికి, కాంగ్రెస్‌కు 76సీట్లు రానున్నాయట. ఢిల్లీలో 36 సీట్లు బిజెపికి, 22 సీట్లు కాంగ్రెస్‌కు, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 8 స్థానాలు వస్తాయట.












Click it and Unblock the Notifications