వైసీపీ ప్రైవేట్ బిల్లుపై మరో ట్విస్ట్ ? సుప్రీం విచారణ వాయిదా-కీలకంగా లోక్ సభ స్పీకర్ నిర్ణయం !
ఏపీ పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడటం వైసీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతున్న వైసీపీ వ్యూహాలపై ప్రభావం చూపబోతోంది.
ఏపీని రెండు రాష్ట్రాలుగా విభజిస్తూ 2014లో కేంద్రం తెచ్చిన పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఈ పిటిషన్లను ముట్టుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్న సుప్రీంకోర్టు.. మరోసారి తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. దీంతో ఇదే విభజన చట్టాన్ని అమలు చేయాలంటూ పార్లమెంటులో వైసీపీ సర్కార్ పెట్టబోతున్న ప్రైవేట్ మెంబర్ బిల్లు వ్యవహారం సస్పెన్స్ గా మారబోతోంది.

ఏపీ విభజన చట్టం రచ్చ
ఏపీని రెండు రాష్ట్రాలుగా విభజిస్తూ కేంద్రం 2014లో తీసుకొచ్చిన చట్టం చట్టబద్ధతపై అప్పుడే పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 28 మంది పిటిషనర్లు 32 పిటిషన్ల వరకూ దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు 9 ఏళ్లు కావస్తున్నా నిర్ణయం తీసుకోలేకపోతోంది. అన్నింటికంటే మించి రెండు రాష్ట్రాల విభజన పూర్తయిన తర్వాత దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందనే భయాలు అందరినీ ఆవహించాయి. దీంతో విభజన పిటిషన్ల వ్యవహారం సుప్రీంకోర్టులో అప్పటి నుంచి నానుతూనే ఉంది. కానీ ఎట్టకేలకు ఈ పిటిషన్ల విచారణలో కదలిక తెచ్చేందుకు కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ నేపథ్యంలో విచారణకు సిద్ధమైన సుప్రీంకోర్టు.. దీనిపై విచారణ సుదీర్ఘంగా సాగుతుందేమో అన్న ఆలోచనతో మరోసారి వాయిదా వేసింది.

ఏప్రిల్ 11కు విభజన పిటిషన్ల విచారణ వాయిదా
ఏపీ పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నిన్న విచారణకు సిద్ధమైన సుప్రీంకోర్టు ధర్మాసనం.. దీనికి కనీసం నెల రోజులైనా పడుతుందని అంచనా వేసింది. దీంతో కేసు విచారణను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకుంది. అంత సమయం అక్కర్లేదని రెండు రోజులు సరిపోతుందని పిటిషనర్ల న్యాయవాది చెప్పడంతో ఏప్రిల్ 11కు వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు బెంచ్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న విచారణ తిరిగి ప్రారంభం కానుంది. అది ఎప్పటికి తేలుతుందో ఎవరికీ తెలియని పరిస్దితి.

వైసీపీ ప్రైవేట్ బిల్లుపై ప్రభావం
ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన పలు హామీలు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు, అలాగే పలు మార్పులు చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తాజాగా లోక్ సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరారు. లోక్ సభ సచివాలయం దీనికి అనుమతి కూడా ఇచ్చింది. అయితే సచివాలయం అంగీకరించినా ఈ ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టేందుకు సుప్రీంకోర్టులో విభజన పిటిషన్ల విచారణ ఆటంకంగా మారబోతోందన్న చర్చ జరుగుతోంది. దీంతో ఈ ప్రైవేటు బిల్లు భవితవ్యం కూడా సస్పెన్స్ లో పడింది.

ఏం జరగబోతోంది ?
ఏపీ పునర్విభజన చట్టంపై సుప్రీంకోర్టులో నిన్న తిరిగి విచారణ ప్రారంభమై సానుకూల ఫలితాలు వెలువడే పరిస్ధితి ఉంటే వైసీపీ ప్రైవేటు మెంబర్ బిల్లును ఈ బడ్జెట్ సెషన్ లో ప్రవేశపెట్టేందుకు పెద్దగా అడ్డంకులు ఉండేవి కావు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో లోక్ సభ సచివాలయం అనుమతించినా స్పీకర్ దీన్ని ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు కావడంతో దీనిపై లోక్ సభలో చర్చ సరికాదని భావిస్తే మాత్రం కచ్చితంగా ఈ బిల్లు పెట్టేందుకు అనుమతి ఇవ్వకపోవచ్చు. అదే జరిగితే రాజధాని మార్పుకు అసెంబ్లీకి ఉన్న అధికారాలపై చర్చ కానీ, సవరణకు వైసీపీ చేస్తున్న ప్రతిపాదనలకు కానీ మోక్షం కలగకపోవచ్చు. ఇవన్నీ తిరిగి రాజధాని మార్పుపై ప్రభావం చూపడం ఖాయం.












Click it and Unblock the Notifications