AP Pensions: ఏపీలో మరోసారి పెన్షన్ల టెన్షన్-పోలింగ్ ముగిసినా తొలగని సస్పెన్స్..!
ఏపీలో గత రెండు నెలలుగా సామాజిక పెన్షన్ల విషయంలో ప్రతీ నెలా ఒకటో వారం సస్పెన్స్ తప్పడం లేదు. ఈసీ ఆదశాలతో వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి పక్కనబెట్టాక ప్రభుత్వం నేరుగా ఆన్ లైన్ లో వేస్తే సరిపోయే దానికి, వివిధ కారణాలు చూపుతూ పెన్షన్లరను బ్యాంకుల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిప్పుతుండటంతో ఈసారి కూడా ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో జూన్ 1న ప్రభుత్వం చేసే పెన్షన్ల పంపిణీ కోసం వృద్ధులు, మహిళలు ఎదురుచూస్తున్నారు.
జూన్ 1న సామాజిక పెన్షన్ల పంపిణీ జరగాల్సి ఉండగా ఇప్పటివరకూ సీఎస్ కానీ సెర్ఫ్ సీఈవో కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. గత నెలలో ఈసీ ఆదేశాలతో బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి ఆన్ లైన్ లోనూ, లేని వారికి ఇళ్ల వద్ద సచివాలయ సిబ్బంది పంపిణీ చేసారు. ఈసారి కూడా అలాగే చేస్తారా లేక ఎన్నికలు ముగిశాయి కాబట్టి వాలంటీర్లకు అవకాశం కల్పిస్తారా అన్నది తేలాల్సి ఉంది. గత రెండు నెలల్లో ఎన్నికల కారణం చూపి వాలంటీర్లను ఈసీ పక్కనబెట్టింది. ఈసారి ఎన్నికలు ముగిశాయి కాబట్టి వాలంటీర్లతో పంపిణీకి ఈసీ అభ్యంతరాలు చెప్పకపోవచ్చు.

మరోవైపు జూన్ 1న ఎట్టి పరిస్ధితుల్లోనూ లబ్దిదారులకు ఇంటి వద్దే పెన్షన్ అందేలా చూడాలని విపక్ష నేత చంద్రబాబు అధికారులను కోరినట్లు టీడీపీ నేత దేవినేని ఉమ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో జగన్ కు మేలు జరగాలనే కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి పింఛన్ దారులను ఇబ్బంది పెట్టారని దేవినేని ఆరోపించారు. సచివాలయం, బ్యాంకుల చుట్టూ తిరగలేక ఎండవేడిమిలో పింఛన్ దారులు అల్లాడి పోయారన్నారు. వడదెబ్బతో మృత్యువాత పడ్డారన్నారు.
ఎన్నికల్లో లబ్ధికోసం టీడీపీపై బురద చల్లేందుకు యత్నించారని, కానీ ఈసారి జూన్ 1 వస్తున్నా ఇప్పటికి పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం నుండి ఒక్క స్టేట్ మెంట్ లేదని దేవినేని ఉమ ఆక్షేపించారు. ఎన్నికలు ముగిసాయి కాబట్టి ఇకనైనా సీఎస్ కుట్రలు ఆపాలన్నారు. బ్యాంకుల్లో వేసిన డబ్బులు ఎంతమంది తీసుకున్నారు, ఎంత మంది తీసుకోలేదు, అన్ని వివరాలను బయట పెట్టాలన్నారు. చాలా మంది పింఛన్ దారుల బ్యాంక్ అకౌంట్ లు పనిచేయక వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయన్నారు. మరికొంతమంది పింఛన్ దారుల డబ్బులు కట్ అయ్యాయన్నారు.












Click it and Unblock the Notifications