ఎంపీల రాజీనామాలపై సస్పెన్స్: ముగ్గురు ముందుకే
న్యూఢిల్లీ: రాజీనామాలపై కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఎంపీలు రాజీనామాలకు సిద్ధపడితే మరికొందరు వెనక్కి తగ్గారు. ఇంకొందరు తర్జన భర్జన పడుతున్నారు. సిడబ్ల్యూసి విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం ఎంపీలు సభాపతి మీరు కుమార్ అపాయింటుమెంట్ తీసుకున్నారు. పదకొండు గంటలకు అపాయింటుమెంట్ ఇచ్చినప్పటికీ అది గంట వాయిదా పడింది.
ఏడుగురు ఎంపీలు రాజీనామా చేసేందుకు తొలుత సిద్ధపడ్డారు. ఇప్పుడు అందులో కొందరు వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనుమూరి బాపిరాజులు రాజీనామాలపై వెనక్కి తగ్గారు. రాయపాటి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామి రెడ్డిలు రాజీనామాలకే మొగ్గు చూపుతున్నారు. హర్ష కుమార్, సాయి ప్రతాప్, ఎస్పీవై రెడ్డిలు రాజీనామాలపై తర్జన భర్జన పడుతున్నారట.

రాజీనామాలు చేస్తే సభలో బిల్లును వ్యతిరేకించే అవకాశముండదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని, రాజీనామాలు వద్దని ఆయన సూచించారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. తాము రాజీనామా చేసినా ప్రభుత్వం పడిపోయే అవకాశం లేదన్నారు. రాజీనామా చేస్తే సీమాంధ్రులకు అన్యాయం చేసినట్లే అన్నారు.
పార్లమెంటులో సెంట్రల్ హాలులో తాము చర్చించి రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని హర్ష కుమార్ చెప్పారు. తమ రాజీనామాలతో ప్రభుత్వం పడిపోదని, అందరం కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, పార్లమెంటు సెంట్రల్ హాలులో ముఖ్యమంత్రితో నలుగురు ఎంపీలు సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications