సినిమా కథ అంటే ఆమ్రపాలిదే: లేడీ కలెక్టర్‌పై ఎస్వీ కృష్ణారెడ్డి ప్రశంసలు

Subscribe to Oneindia Telugu

వరంగల్: జిల్లా కలెక్టర్ ఆమ్రపాలిపై సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి వ్యక్తిలో ఓ స్పిరిట్‌ ఉంటుందన్న ఆయన.. వరంగల్‌లో ఓ వ్యక్తిలో మంచి స్పిరిట్‌ ఉన్న సినిమా కథ ఏదైనా ఉందంటే అది కలెక్టర్‌ ఆమ్రపాలిదేనని స్పష్టం చేశారు.

ముఖ్య అతిథిగా..

ముఖ్య అతిథిగా..

ఓరుగల్లు కళావైభవం వేడుకలో భాగంగా ఆదివారం కాజీపేటలోని నిట్‌ ఆడిటోరియంలో షార్ట్‌ఫిల్మ్‌ కాంపిటేషన్‌, స్ర్కీనింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కృష్ణారెడ్డి. విశిష్ట అతిథులుగా కలెక్టర్‌ ఆమ్రపాలి, ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, సినీ నిర్మాత అచ్చిరెడ్డి, హీరో నవదీప్‌, దర్శకుడు తరుణ్‌భాస్కర్‌, హాస్యనటుడు వేణుమాధవ్‌ హాజరయ్యారు.

ఆమ్రపాలి అద్భుతాలు సాధించారు..

ఆమ్రపాలి అద్భుతాలు సాధించారు..

ఈ సందర్భంగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కాలుకు గజ్జె కట్టాలన్నా, సినిమాకు పాట రాయలన్నా, హృద్యమైన పాట పాడాలన్నా, అందరూ మెచ్చేలా చదువుకోవాలన్నా, ఆదర్శవంతమైన రాజకీయం చేయాలన్నా వరంగల్‌కే సాధ్యమన్నారు. ఈ వరంగల్‌లో మంచి సినిమా కథ ఏదైనా ఉందంటే అది కలెక్టర్‌ ఆమ్రపాలిదే అన్నారు. కలెక్టర్‌ ఆమ్రపాలిలా అద్భుతాలు సాధించడానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు.

మొదట ఎంచుకోవాల్సినవి అవే..

మొదట ఎంచుకోవాల్సినవి అవే..

ఇక్కడ ప్రదర్శించిన లఘుచిత్రాలన్నీ తనకు నచ్చాయని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు.
షార్ట్‌ఫిల్మ్‌ తీయాలన్నా.. పెద్ద సినిమా తీయాలన్నా మంచి కథ, స్క్రీన్ ప్లేను మొట్టమొదటగా ఎంచుకోవాలన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడారు.

హీరోయిన్ కథలూ రావాలి.. ఆమ్రపాలి స్ఫూర్తి

హీరోయిన్ కథలూ రావాలి.. ఆమ్రపాలి స్ఫూర్తి

కలెక్టర్‌ ఆమ్రపాలి మాట్లాడుతూ.. చాలా చిత్రాల్లో హీరో డామినేట్‌ కథలు వస్తున్నాయని మహిళా కథల ప్రాధాన్యాన్ని వివరించేందుకు దర్శకులు శ్రద్ధ చూపాలన్నారు. హీరో నవదీప్‌ మాట్లాడుతూ.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ప్రజలకు కలెక్టరే స్ఫూర్తి ప్రదాత అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. మరుగునపడిన వరంగల్‌ సాంస్కృతిక, సాహితీ,కళా వైభవాన్ని మళ్లీ వెలుగులోకి తేవడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.

సొంతింటికి రావడమే..

సొంతింటికి రావడమే..

అనంతరం దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. వరంగల్‌కు రావడం తన సొంతింటికి రావడమేనన్నారు. తాను మరో 3 చిత్రాలు తీసే ప్రయత్నంలో ఉన్నానని అందులో టాలెంట్‌ ఉన్న స్థానికులకే ప్రాధాన్యమిస్తానన్నారు. తాను చిత్రసీమలో స్థిరపడిన తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్రపై సినిమా తప్పకుండా తీస్తానన్నారు. కమేడియన్‌ వేణుమాధవ్‌ మాట్లాడుతూ.. వరంగల్‌లో కార్యక్రమాలకు హాజరుకావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బుల్లితెర నటుడు సాగర్‌, సమాచార శాఖ డీడీ జగన్‌ హాజరయ్యారు.

నవ్వులు పూయించిన వేణుమాధవ్

నవ్వులు పూయించిన వేణుమాధవ్

చిన్నారులు కలెక్టర్‌ ఆమ్రపాలిని ఉత్సాహంగా పలు ప్రశ్నలు అడిగారు. మీకు స్ఫూర్తి ఎవరు? అని అడిగిన ప్రశ్నకు కలెక్టర్‌ కొద్దిసేపు ఆలోచించారు.ఈ లోగా హాస్యనటుడు వేణుమాధవ్‌ తన పేరుమాత్రం చెప్పవద్దనడంతో సభలో నవ్వులు వెల్లువిరిశాయి.
కాగా, ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం మైదానంలో జరిగిన వేడుకల్లో హాస్యనటుడు వేణుమాధవ్ ఆధ్వర్యంలో జబర్దస్త్ ఫేం వెంకీ, రచ్చ రవి, మిమిక్రీ రవి, రాకేశ్ రాఘవ, మిమిక్రీ మూర్తి తదితరులు ప్రదర్శించిన హాస్యవల్లరి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఓరుగల్లు వైభవంలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన మినీ వేదికల వద్ద కళాకారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియం మైదానం వేదికగా మైం కళాధర్ ప్రదర్శన, ప్రఖ్యాత నాట్య గురువులు పద్మజ, రేణుక శిష్య బృందం కూచిపూడి నృత్యాలు రంజింపజేశాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tollywood director SV Krishna Reddy on Sunday praised Warangal collector Amrapali.
Please Wait while comments are loading...