జనసేన సీటు కోసం ప్రయత్నిస్తోన్న పీఠాధిపతి??
చుట్టూ పచ్చటి వాతావరణం.. పక్షుల కిలకిల రావాలు.. ఉట్టిపడే ఆధ్యాత్మికత.. నలువైపులా కొలువైన భగవంతుడు.. ప్రశాంతంగా ఉండే ఆశ్రమం.. భక్తులతో నాలుగు మంచి మాటలు.. ఈ తరహా వాతావరణాన్ని కాదనుకొని రణగొణ ధ్వనులు.. డబ్బులతో ముడిపడివుండే అంశాలు.. నిత్యం అబద్దాలు ఆడటం.. ప్రత్యర్థులపై విమర్శలు.. లాంటివి కావాలనుకొని ఒక స్వామీజీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టాలని ఎప్పటినుంచో ఆశ ఉన్నప్పటికీ ప్రయత్నాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ మతం గురించి ప్రచారం
ఏపీలో ఉన్న పీఠాధిపతుల్లో ఈ స్వామీజీ కూడా ఒకరు. ఎక్కడైతే విజయం సాధించగలుగుతాం? ఏ పార్టీ అయితే బాగుంటుంది? గెలుపొందాలంటే ఎంత ఖర్చుపెట్టాల్సి ఉంటుంది? లాంటి లెక్కల్లో ఇప్పడు ఆయన మునిగిపోయారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన పీఠానికి సంబంధించి కొంతకాలం వివాదం నడిచింది. వాస్తవానికి ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూమతం గురించి ప్రచారం చేస్తూ పర్యటనలు చేస్తుంటారు. బీజేపీకి అనుబంధంగా ఉంటూ అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్లి వస్తుంటారు. రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రితో అత్యంత చనువుగా ఉంటారు.

లోక్ సభకు సాధ్యమయ్యేలా లేదే?
ఇప్పుడు ఈ స్వామీజీ జనసేన వైపు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొసగదు.. వైసీపీలో ఖాళీలేదు.. బీజేపీ తరఫున పోటీచేసినా గెలుస్తామన్న నమ్మకం లేకపోవడంతో ఆయన జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం. సంప్రదింపులు, రాయబారాల కోసం అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఎంపీగా పోటీచేసి లోక్‌సభకు వెళ్దామనుకుంటున్నప్పటికీ అది సాధ్యమయ్యేలా లేకపోవడంతో తన సామాజికవర్గం ఎక్కువగా ఉండే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకొని అక్కడి నుంచి రెండు సంవత్సరాలు ముందుగానే గ్రౌండ్ వర్క్ చేసుకొని కనీసం శాసనసభలో అడుగుపెడదామనుకుంటున్నారు. ఆయన ప్రయత్నం ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి మరి.

జనసేన అయితేనే బాగుంటుందని..
రాబోయే ఎన్నికలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకే కాదు.. జనసేనకు కూడా చాలాకీలకం. గత ఎన్నికల్లో కేవలం రాజోలు స్థానాన్ని మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. జనసేనాని పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నుంచి పోటీచేసినప్పటికీ స్వల్ప తేడాతో రెండు నియోజకవర్గాల్లోను ఓటమి పాలయ్యారు. పవన్ ఓటమితో ఆ పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈసారి ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని భావిస్తున్న పవన్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. అంతేకాకుండా సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా కొంతమంది నేతలను పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. బలమైన అభ్యర్థుల కోసం వేట కూడా ప్రారంభమైంది. ఇటువంటి తరుణంలోనే సదరు స్వామీజీ దృష్టి జనసేనపై పడింది. సీటు దక్కించుకునే అవకాశాలు కనపడుతున్నప్పటికీ విజయావకాశాల కోసం ఏం చేస్తారో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications