నిమ్మరసం తాగింది చెప్పు: కేసీఆర్‌పై ఉత్తమ్ సంచలనం, రేవంత్‌కు అండ!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మంగళవారం నాడు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో లంచం ఇవ్వజూపిన కేసులో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి పైనా స్పందించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి దొరికాడు కాబట్టి దొంగ అని, తెరాస నేతలు దొరకలేదు కాబట్టి దొరల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దొర కూడా దొంగలా మారే రోజు త్వరలో వస్తుందన్నారు. ఇతర పార్టీల నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఎంతకు కొన్నారనే దాని పైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తారు.
దీనిపై విచారణ జరిపిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ సరైన ప్రతిపక్షంగా వ్యవహరించిందన్నారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీకి వందకు వంద మార్కులు వచ్చాయన్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... తెరాస ఎమ్మెల్యేలే ప్రభుత్వం పాలన పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. మూడు నెలలు అయినా ముఖ్యమంత్రి అపాయింటుమెంట్ దొరకడం లేదని వాపోయారు.
అంతర్గతంగా తెరాస ఎమ్మెల్యేలు కూడా నలిగిపోతున్నారని చెప్పారు. తెలంగాణను వ్యతిరేకించిన మజ్లిస్ పార్టీని తెరాస ఆకర్షించిందన్నారు. తెలుగుదేశం, తెరాస పార్టీలు వికృత రాజకీయాలకు తెరలేపాయని అన్నారు. పాఠ్యాంశాల్లో కేసీఆర్ ఖమ్మంలో నిమ్మరసం తాగిన ఘటనను కూడా చేర్చాలన్నారు.
ఏడాది పాలనలో తెరాసకు వందకు ఐదు మార్కులే వేస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ పలు ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం సహా ఎన్నో వరాలు ఇచ్చినా సోనియా గాంధీని తెరాస విస్మరిస్తోందన్నారు.
తెలంగాణకు లబ్ధి చేకూరేలా విభజన చట్టంలో మార్పులు చేశారని చెప్పారు. ఆ చట్టాన్ని ప్రధాని మోడీ అమలు చేయడంలేదని, కేసీఆర్ ఆ వ్యవహారం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో ఆంధ్రావాళ్లు దోచుకున్నారన్న కేసీఆర్ ఆరోపించారని, ఇప్పుడు వాటర్ గ్రిడ్, ఇతర పథకాల్లో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎలా వచ్చారన్నారు.
ఆంధ్రా ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నష్టమని తెలిసినా సోనియా తెలంగాణను ఇచ్చారన్నారు. ప్రతి ఏడాది జూన్ 2న సోనియా కృతజ్ఞతా దినోత్సవంగా పాటించనున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ చరిత్ర పాఠ్యాంశాల్లో సోనియా పేరును చేర్చాలన్నారు.












Click it and Unblock the Notifications