వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర టిడిపి, జగన్ పార్టీలపై టి ఎమ్మెల్యేల ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాసనసభలో సోమవారం తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంలో సీమాంధ్ర ప్రాంత తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వ్యవహరించిన తీరుపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ శాసనసభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతున్న సమయంలో సీమాంధ్ర నేతల వ్యవహారం తీవ్ర అభ్యంతరకరంగా ఉందని ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు.

వెంకటరమణారెడ్డి సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొని తెలంగాణ ఏర్పాటుకు సానుకూల నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపర్చేలా శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు చించివేయడం అనాగరికమని గండ్ర అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ముసాయిదా బిల్లును దహనం చేయడం దుర్మార్గపు చర్య అని ఆరోపించారు.

 T leaders

రాజ్యాంగంపై గౌరవం లేని విధంగా సీమాంధ్ర టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వ్యవహరిస్తున్నారని గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ పార్టీల నేతలను కలుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల కల సాకారమవుతున్న సమయంలో, ప్రజా సమస్యలను అసెంబ్లీలో చర్చించాలే తప్ప ఈ విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. బిఏసి సమావేశంలో అన్ని అంశాలపై చర్చించి అన్ని పార్టీలు బిల్లుపై శాసనసభలో తమ అభిప్రాయాలను తెలపాలని కోరారు.

బిల్లును ఆపడం సరికాదు: ఈటెల

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శాసనసభకు కేంద్రం బిల్లు పంపిస్తే స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారని, బిల్లును ఆపడం సరికాదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. బిల్లుపై చర్చకు సహకరించకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమేని ఆయన అన్నారు.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బిల్లు ప్రతులను చించివేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని ఈటెల చెప్పారు.

దిగవంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పి కేంద్రానికి లేఖలు పంపారని ముసలీకన్నీరు పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయమ్మ ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిల నిజస్వరూపం బయటపడిందని రాజేందర్ అన్నారు. వారందరూ ఆంధ్ర బాబులేనని ఆరోపించారు.

తెలంగాణను అడ్డుకేనే ప్రయత్నాలను ఆపాలని ఈటెల అన్నారు. తామందరం విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ప్రయత్నిస్తుంటే.. సీమాంధ్ర నేతలు తమ గుండెల్లో గుద్దినట్లుగా బిల్లు ప్రతులను చించివేశారని ఆయన అన్నారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చేతులు ముడుచుకుని కూర్చోమని ఆయన హెచ్చరించారు. వారందరికీ ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని రాజేందర్ తెలిపారు.

ప్రజా పోరాటాలతోనే బిల్లు వచ్చింది: మల్లేష్

ప్రజా పోరాటాలు, ప్రాణ త్యాగాలతోనే తెలంగాణ ముసాయిదా బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగిందని సిపిఐ శాసనసభ సభ్యుడు గుండా మల్లేష్ అన్నారు. స్పీకర్ బిల్లుపై జాప్యం చేయకుండా చర్చించాలని డిమాండ్ చేశారు. గతంలో తాము తెలంగాణకు అనుకూలమని లేఖలు పంపిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలు ఇప్పుడు కొత్తగా సమైక్యాంధ్ర అనే డిమాండ్లను తీసుకొస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ ముసాయిదా బిల్లుపై వెంటనే చర్చించి కేంద్రానికి పంపించాలని, సభలో సమైక్య తీర్మానానికి ఆస్కారం లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర నేతలు ముసాయిదా బిల్లు ప్రతులను చించివేయడమంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని తెలిపారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే బిల్లుపై వాదనలు తెలపాలి కానీ, బిల్లును అడ్డుకోవడం మంచిది కాదని మల్లేష్ అన్నారు. సీమాంధ్ర ప్రజల అపోహలు తొలగించాలని చెప్పారు. వెంటనే తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

కిరణ్ వల్లే ఆలస్యం: ఎర్రబెల్లి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వల్లే తెలంగాణ బిల్లు మూడు రోజులు ఆగిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పనర్ వ్యవస్థీకరణ బిల్లుపై ఓటింగ్ అవసరం లేదని ఆయన తెలిపారు. విద్యార్థుల త్యాగాల ఫలితమే తెలంగాణ అని ఎర్రబెల్లి ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు తెలంగాణ ముసాయిదా బిల్లును అడ్డుకోవద్దని ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

English summary
Telangana Congres and TDP, TRS, CPI MLAs fired at Seemandra Telugudesam and YSR Congress Party MLAs on Monday during Telangana draft bill has been introduced in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X