తాడిపత్రి టౌన్ సిఐ ఆత్మహత్య.. కారణం అదేనా?
సమస్యలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి అని అందరికీ చెప్పి, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పోలీసులే అనేక కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పని ఒత్తిడి, కుటుంబ కలహాలు వంటి అనేక కారణాలతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. పోలీసుల ఆత్మహత్యలు ఇప్పుడు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి.
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తాడిపత్రి టౌన్ సిఐ ఆనందరావు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ఈ విషాద ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు సిఐ ఆనందరావు ఇంటికి చేరుకొని సంఘటన స్థలంలో ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి పని ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

జిల్లా నైట్ అలర్టింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించిన ఆయన అర్ధరాత్రి వరకు సిబ్బందితో మాట్లాడి ఆపై ఇంటికి వెళ్లి ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. విపరీతమైన పని ఒత్తిడి వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆయన సెప్టెంబర్ లో ప్రొద్దుటూరు నుంచి సి ఐ గా బదిలీపై తాడిపత్రి కి వచ్చారు.
తాడిపత్రిలో వైసిపి టిడిపి మధ్య రాజకీయ వాతావరణం నేపథ్యంలో పోలీసులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే తాడిపత్రి సిఐ ఆనంద్ రావు మృతికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంతాపం తెలియజేశారు. సీఐ ఆనంద రావు కుటుంబసభ్యులను పరామర్శించారు.సంఘటన స్థలాన్ని అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు.
సీఐ ఆనంద రావు మృతికి గల కారణాలపై ఎస్.పి శ్రీనివాసరావు కూడా ఆరా తీశారు. స్థానికంగా సిఐ ఆత్మహత్య చేసుకోవడంతో తాడిపత్రి లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఆత్మహత్యకు సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. అసలు ఎందుకు సిఐ ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది.












Click it and Unblock the Notifications