కేసీఆర్‌తో తలసాని, ట్విస్ట్: డబ్బుంటే: ఏకేసిన జగ్గారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సనత్ నగర్ శాసన సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం మధ్యాహ్నం కలిశారు. తలసానితో పాటు పద్మారావు నగర్ కాలనీ వాసులు కూడా వచ్చారు. మెట్రో కారణంగా ఇళ్ల కూల్చివేతలో న్యాయం చేయాలని తలసాని ముఖ్యమంత్రిని కోరారు. బాధితులకు త్వరలో ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.
కాగా, తలసాని తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు కేసీఆర్‌ను కలుస్తారని, చేరికపై చర్చిస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆయన మెట్రో సమస్యల పైన కలిశారు. ఇదిలా ఉండగా.. వీరి మధ్య పార్టీ మారే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. తలసాని త్వరలో కారు ఎక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
తెరాసపై జగ్గారెడ్డి ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర సమితి పైన భారతీయ జనతా పార్టీ బీజేపీ మెదక్ లోకసభ అభ్యర్థి జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటమి భయంతోనే తెరాస తన పైన అభాండాలు వేస్తోందన్నారు. వ్యక్తిగతంగా కాకుండా.. అభివృద్ధిలో పోటీ పడదామని ఆయన సవాల్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి టిక్కెట్లు అమ్ముకుందన్నారు. తన వద్ద డబ్బుంటే తెరాస టిక్కెటే కొనుక్కునే వాణ్ణి అన్నారు. కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉందంటే అది బీజేపీ బిక్షే అన్నారు.
తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఉద్యమంలో ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఓటమి భయంతో తెరాస తన జపం చేస్తోందన్నారు. హరీష్ రావు రోజు తన జపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగ్గారెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని బీజేపీ నేత చింతల రామచంద్రా రెడ్డి అన్నారు. ఆయన ఆరెస్సెస్ కార్యకర్త అన్నారు. తాము గెలిచేందుకు అవకాశం ఉండటంతో తెరాస ఆరోపణలు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications