చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ పై ప్రేమ అందుకే.. అవసరమైతే ఎవరి కాళ్లయినా పట్టుకుంటారు: తమ్మినేని సీతారాం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై, ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా నీటి యాజమాన్య భవనాన్ని తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ సినిమాలను రాజకీయాలకు ఉపయోగించుకోవాలని చంద్రబాబు, లోకేష్ చూస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుకు పవన్ మీద విపరీతమైన ప్రేమ అందుకే
సినిమా ఇండస్ట్రీ మీద గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు, లోకేష్ ట్వీట్లు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ప్రేమ ఉన్నట్టు చంద్రబాబు, లోకేష్ లు మాట్లాడుతున్నారని తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో శ్రమించిన ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం చంద్రబాబు, లోకేష్ ఏనాడు ఆలోచించలేదని కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కోసం లేని ప్రేమను ఒలకబోస్తున్నారు అంటూ మండిపడ్డారు.

రాజకీయ ప్రయోజనాల కోసం లోకేష్, చంద్రబాబు దిగజారుతారు
రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, లోకేష్ ఎంతకైనా దిగజారుతారు అని, ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటారని తీవ్ర విమర్శలు గుప్పించారు తమ్మినేని సీతారాం. సినిమా ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వంతో చర్చించారని, ఓ కమిటీ వేసి రిపోర్ట్ ఇవ్వాలని అడిగామని రిపోర్టు విషయంలో, జీవో విషయంలో ఎక్కడా జాప్యం జరగలేదని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సినిమా ఏదైనా బాగుంటే ఆడుతుందని అఖండ, చిన్న సినిమా అయినా డీజే టిల్లు బాగా ఆడాయి అని గుర్తు చేశారు తమ్మినేని సీతారాం.

జీవో రాక ముందు సినిమా రిలీజ్ చేసి మేమేం చెయ్యలేదనటం తప్పు
గతంలో చంద్రబాబు ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు, చిరంజీవి సినిమాలకు ఇబ్బందులు పెట్టారని ఆరోపణలు గుప్పించారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో స్పందించిన ఆయన ప్రభుత్వం కావాలని పవన్ కళ్యాణ్ సినిమాకి ఇబ్బందులు పెట్టడం లేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అయినా అకీరానందన్ అయినా ఒకటేనని జీవో రాకముందే సినిమాలు రిలీజ్ చేసి మేము ఏమీ చేయలేదని చెప్పడం తప్పని ఆయన పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఏదో చెయ్యటం ప్రభుత్వానికి సాధ్యం కాదు
మరో నాలుగు రోజులు సినిమా రిలీజ్ వాయిదా వేసుకుంటే అనుకున్నట్టు షోలు, రేట్లు పాజిటివ్ గా వచ్చేవని ఆయన పేర్కొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. కేవలం పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా ఏదో చెయ్యాలంటే అది ప్రభుత్వానికి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. దీనిని కక్ష సాధింపుగా చంద్రబాబు చూపించే ప్రయత్నం చెయ్యటం కేవలం రాజకీయ లబ్ది కోసమే అని పేర్కొన్నారు. కావాలని అనవసరపు రాద్ధాంతం చేయడం మంచిది కాదని హితవు పలికారు తమ్మినేని సీతారాం.












Click it and Unblock the Notifications