టిడిపి ఎమ్మెల్యే సత్యప్రభకు షాక్: రూ. 265కోట్ల ఆస్తుల సీజ్
చిత్తూరు: తెలుగుదేశం ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు చెందిన సంస్థలపై ఆదాయపు పన్ను అధికారులు దాడి చేశారు. బెంగళూరుతో సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యా, ఇతర సంస్థలపై అధికారులు దాడులు నిర్వహించారు.
పన్నుఎగవేత కారణంగా అధికారులు ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.
కాగా, అధికారులు దాదాపు రూ.300 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. ఈ వార్త జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.
బుధవారం బెంగళూరులో ఐటీ అధికారులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో బెంగళూరులోని వైదేహీ, మాల్యా ఆస్పత్రుల్లో దాడులు చేయగా దాదాపు రూ.265 కోట్ల ఆస్తులకు సరైన ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు వారు తెలిపారు.

సెప్టెంబర్ 23 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆమె కంపెనీలు, ఇళ్లలో జరిగిన సోదాల్లో ఎమ్మేల్యేకు సంబంధించిన విద్యా సంస్థల నుంచి దాదాపు రూ.43 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు పేర్కొన్నారు. గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో సంస్థలకు చెందిన భారీ మొత్తంలో నగదును సీజ్ చేసినట్లు తెలిపారు.
స్వచ్ఛంద కార్యక్రమాల కోసం ఆమెకు సంబంధించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెద్ద మొత్తంలో విరాళంగా స్వీకరించినట్లు తెలిపారు. ఎమ్మెల్యేకు చెందని సంస్థల నుంచి పలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కాగా, 13 సంవత్సరాల ఆదాయ ఖర్చుల వివరాలు తెలపాల్సిందిగా అధికారులు దివంగత వ్యాపారవేత్త, మాజీ ఎంపి డీకే ఆదికేశవులు నాయుడు సతీమణి, ఎమ్మెల్యే సత్యప్రభకు ఆదేశించారు. వైదేహి గ్రూప్ వ్యవస్థాపకుడు డీకే ఆదికేశవులు నాయుడు దివంగతులైనప్పటికీ ఆయన పేరునే సంస్థ కొనసాగుతోంది. ఈ సంస్థకు చెందిన మెడికల్ కళాశాలల్లో కూడా అవకతవకలు చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.












Click it and Unblock the Notifications