విజయవాడ నుంచి బ్లాక్ మనీ ఎక్స్ పోర్ట్ ! ప్రైవేట్ జెట్ల ద్వారా-ఢిల్లీ మద్యం స్కాంతో-టీడీపీ షాకింగ్ !
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. వైసీపీ సర్కార్ ఇప్పటికే కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు ఎగుమతులు చేస్తోందంటూ ఆరోపిస్తున్న టీడీపీ వాటి ఆధారాలను కూడా గతంలో బయటపెట్టింది. ఇప్పుడు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి నల్లధనం విదేశాలకు తరలిపోతోందంటూ మరో సంచలన ఆరోపణ చేసింది. దీనికి తగిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ టీడీపీ నేత పట్టాభి చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.

పట్టాభి మరో సంచలనం
గతంలో వైసీపీ ప్రభుత్వంలో డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ ఇప్పుడు మరో సంచలనం రేపారు. అదీ వైసీపీ ప్రభుత్వంతో పాటు కేంద్రాన్ని కూడా ఈ వ్యవహారంలోకి లాగారు. వైసీపీ ప్రభుత్వంపై గతంలో చేసిన విదేశాలకు ఎగుమతుల ఆరోపణలకు మరింత పదును పెడుతూ ఈసారి మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు. అదీ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించింది కావడంతో దీనిపై చర్చ జరుగుతోంది.

విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి నల్లధనం ఎగుమతి ?
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు నల్లధనం ఎగుమతి అవుతోందంటూ టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నల్లధనాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తోందని పట్టాభి సంచలన ఆరోపణ చేశారు. దీనికి ఆధారంగా మరికొన్ని విషయాల్ని కూడా పట్టాభి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టుకు సీఐఎస్ఎఫ్ భద్రత ఇస్తామన్నా ప్రభుత్వం అంగీకరించకపోవడాన్ని కూడా పట్టాభి గుర్తుచేశారు. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరుగుతోందో అన్న చర్చ మొదలైంది.

ప్రైవేట్ విమానాల ద్వారా తరలింపు
జగన్ సర్కార్ విదేశాలకు నల్లధనాన్ని తరలించేందుకు ప్రైవేటు విమానాల్ని వాడుకుంటోందని పట్టాభి ఆరోపించారు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రైవేటు విమానాల రాకపోకలు పెరిగాయన్నారు. జగన్ గతంలో దావోస్ టూర్ కు గన్నవరం నుంచి నేరుగా వెళ్లకుండా లండన్ మీదుగా వెళ్లినప్పుడే తాము అనుమానాలు వ్యక్తం చేసినట్లు పట్టాభి గుర్తుచేశారు. అప్పుడు జగన్ బ్లాక్ మనీని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి తరలించినట్లు తాజాగా వెల్లడైన ఆధారాలు చెబుతున్నాయన్నారు. బేగంపేట ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ భద్రత లేనందువల్లే బ్లాక్ మనీ ఇష్టారాజ్యంగా ఎగుమతి అయినట్లు ఈడీ చెబుతోందని, విజయవాడ ఎయిర్ పోర్టులోనూ అదే జరుగుతోందన్నారు.

సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అడ్డుకోవడమెందుకు ?
విజయవాడ ఎయిర్ పోర్టుకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా.. కేంద్రాన్ని పట్టుబట్టారని, దాంతో కేంద్ర హోంశాఖ అంగీకరించిందని పట్టాభి తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సీఐఎస్ఎఫ్ భద్రతను అడ్డుకుంటున్నారని పట్టాభి ఆరోపించారు. అలాగే ఏపీ ఎయిర్ పోర్టు కార్పోరేషన్ సలహాదారుగా తెలంగాణకు చెందిన భరత్ రెడ్డిని ఏరికోరి తెచ్చుకోవడం వెనుక ఉద్దేశం కూడా అదేనని పట్టాభి సంచలన విమర్శలు చేశారు. ఇలాంటి చర్యల ద్వారా బ్లాక్ మనీ ఎగుమతికి జగన్ సర్కార్ దారులు తెరిచిందన్నారు.












Click it and Unblock the Notifications