భారీ మెజార్టీ ఖాయమా?: అందుకే కూకట్‌పల్లి బరిలో నందమూరి సుహాసిని, బాబుతో 20ని.లు భేటీ
హైదరాబాద్/విశాఖపట్నం: మహాకూటమి తరఫున కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని పేరును తెలుగుదేశం పార్టీ దాదాపు ఖరారు చేసింది. గురువారం మధ్యాహ్నం ఆమె విశాఖపట్నంలోని హోటల్ నోవాటెల్‌లో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.
ఇరువురు దాదాపు ఇరవై నిమిషాలు సమావేశమయ్యారు. కూకట్‌పల్లి నుంచి పోటీ, నామినేషన్, పోటీ చేస్తే పరిస్థితి ఏమిటి తదితర అంశాలపై చర్చించారని తెలుస్తోంది. అంతిమంగా సుహాసినిని రంగంలోకి దించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఆమె కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారని సమాచారం.

టీడీపీకి కీలకం.. కూకట్‌పల్లి
తెలుగుదేశం పార్టీకి తెలంగాణలోని కూకట్‌పల్లి కీలకమైన నియోజకవర్గం. కోస్తాంధ్ర నుంచి వచ్చిన చాలామంది సెటిలర్స్ ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. అందుకు నిజాంపేటలో ఇటీవల జరిగిన ప్రచారం సందర్భంగా కేటీఆర్ మాట్లాడిన మాటలే నిదర్శనం. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకంగా లేఖలు రాసి ఉంటారని, ఆ కోణంలో దానిని తప్పుబట్టలేమని, సెటిలర్స్ భద్రతకు తాను హామీ అని చెప్పారు.

సుహాసిని పోటీ చేస్తే గంపగుత్తగా ఓట్లు
కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి కూటమి తరఫున ఇతర ఏ అభ్యర్థిని నిలబెట్టినా ఓట్లు చీలిపోతాయనే వాదన టీడీపీలో ఉంది. సెటిలర్స్‌కు తెరాసపై పెద్దగా వ్యతిరేకత లేదు. అప్పుడు చీలిపోవడం ఖాయం. సుహాసిని వంటి వ్యక్తిని నిలబెడితే ఓట్లు గంపగుత్తగా ఈమెకే పడతాయనే అభిప్రాయాలు తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతున్నాయి.

ఇతర నియోజకవర్గాల పైనా ప్రభావం
కూకట్‌పల్లి నుంచి తొలుత, టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి పేరు వినిపించింది. పెద్దిరెడ్డి కూడా అందుకు సిద్ధమయ్యారు. కానీ నందమూరి కుటుంబం నుంచి అభ్యర్థిని నిలబెడితే కూకట్‌పల్లితో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలపై ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందులో భాగంగా అనూహ్యంగా సుహాసిని పేరు తెరపైకి వచ్చిందని చెబుతున్నారు.

పలువురి పేర్లు పరిశీలన
సుహాసిని కంటే ముందు నందమూరి కళ్యాణ్ రామ్, అలాగే, నందమూరి జానకిరాం సతీమణి స్వాతి నందమూరి పేర్లు కూడా పరిశీలించారని చెబుతున్నారు. పోటీకి ఆసక్తి చూపించకపోవడం, కారణాలు మరేవైనా చివరకు హరికృష్ణ కూతురు సుహాసిని పేరును ఖరారు చేశారని అంటున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో, పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది.

భారీ ఓట్లతో గెలిచిన మాధవరం కృష్ణారావు
2009లో ఇక్కడి నుంచి లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ పోటీ చేసి గెలిచారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన మాధవరం కృష్ణారావు దాదాపు లక్ష ఓట్లు సాధించారు. 43.3 శాతం ఓట్లు దక్కించుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావుకు 56వేలు, కాంగ్రెస్ అభ్యర్థి నర్సింహ యాదవ్‌కు 23 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాధవరం కృష్ణారావు తెరాసలో చేరారు. ఆయన తెరాసలో చేరడంతో టీడీపీ అభ్యర్థి వేటలో పడింది. అప్పటి నుంచి పెద్దిరెడ్డి, కళ్యాణ్ రామ్.. ఇలా పలువురి పేర్లు పరిశీలించారు. చివరకు సుహాసినిని పోటీ కోసం ఒప్పించారని తెలుస్తోంది. సెటిలర్స్ కారణంగా టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకుకు తోడు, నందమూరి కుటుంబం నుంచి సుహాసిని పోటీ చేయడం వల్ల ఇక్కడ ఆమె గెలుపు ఖాయమని, అది కూడా గతంలో కంటే భారీ మెజార్టీ ఖాయమని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications