జగన్ బలం పెంచుతున్న చంద్రబాబు - ఢిల్లీ వేదికగా తేల్చేసారా..!!
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. పొత్తు రాజకీయం ఆరంభమైంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖరారైంది. బీజేపీని కలిసి రావాలంటూ ఈ రెండు పార్టీలు ఆహ్వనిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ పర్యటనలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముందు ఇదే ప్రతిపాదన చేసారు. 2014 ఎన్నికల తరహాలో కలిసికట్టుగా పోటీ చేసి సీఎం జగన్ ను ఓడిద్దామని చంద్రబాబు, పవన్ ప్రతిపాదిస్తున్నారు. దీని ద్వారా పరోక్షంగా తాము అందరం కలిస్తేనే సీఎం జగన్ ను ఓడించగలమనే సంకేతాలు ఇస్తున్నారు.
పొత్తు రాజకీయం:జగన్ తన పార్టీ ఆవిర్భావం తరువాత ఉప ఎన్నికలు ఎదుర్కొన్నా..2014లో తొలి సారి సార్వత్రిక ఎన్నికల సమరంలోకి దిగారు. అప్పుడు జగన్ గెలుపు ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆ సమయం లో ప్రధాని అభ్యర్ధిగా మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు..వారికి మద్దతుగా పవన్ రంగంలోకి దిగారు. పొత్తులతో పోటీ చేసారు. సింగిల్ గా పోటీ చేసిన వైసీపీ 1.95 శాతం ఓట్ల తేడాతో ప్రతిపక్షానికి పరిమితం అయింది.

టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లోనూ తిరిగి వైసీపీ ఒంటరిగానే పోటీ చేసింది. జగన్ తన పాదయాత్ర..మేనిఫెస్టోతో ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు సాధించి సీఎం అయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేసాయి. చంద్రబాబుకు మేలు చేసేందుకే పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు వేరుగా పోటీ చేసారనేది వైసీపీ ఆరోపణ.
సీఎం జగన్ ను ఓడించే లక్ష్యం:ఇప్పుడు మరో సారి ఎన్నికల సంగ్రామానికి పార్టీలు సిద్దం అవుతున్నాయి. టీడీపీ 160 సీట్లు గెలవటం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరో వైపు జనసేన, బీజేపీతో పొత్తుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీని ఓడించటమే తన లక్ష్యమని జనసేనాని పవన్ ప్రకటించారు.
చంద్రబాబుతో జత కట్టారు. బీజేపీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. తనకు గత ఎన్నికల్లో ఓట్లు వేయకపోవటాన్ని పవన్ ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయమని స్పష్టం చేసారు. పవన్ తరువాత ఇప్పుడు బీజేపీ నేతలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలతో పాటుగా పొత్తులపైన ప్రతిపాదనలు చేసారు. నిర్ణయం వెంటనే జరగకపోయినా..మరిన్ని సమావేశాలు జరుగుతాయని చెబుతున్న టీడీపీ నేతలు పొత్తు పైన నమ్మకంతో ఉన్నారు.
సీఎం జగన్ బలం మరింతపెంచారా:ఇక్కడ మరో చర్చ మొదలైంది. జగన్ పైన అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చంద్రబాబు ప్రతీ సభలో చెబుతున్నారు. జగన్ సంక్షేమ పథకాల గురించి టీడీపీ విమర్శలు చేస్తోంది. ఇప్పుడు తిరిగి అదే సంక్షేమం ఎన్నికల మేనిఫెస్టోగా ప్రకటించిన టీడీపీ పరోక్షంగా జగన్ బాటలోనే పయణిస్తోంది. అటు జగన్ ఎవరు ఎవరితో కలిసినా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని పదే పదే చెబుతున్నారు.
కానీ, టీడీపీ, జనసేన మాత్రం తాము జగన్ ను ఓడించాలంటే పొత్తులతోనే ముందుకు వెళ్తామని చెప్పటం ద్వారా జగన్ బలాన్ని అంగీకరిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం ముందు కూడా అదే చెబుతున్నారనే విశ్లేషణ లు మొదలయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అని చెబుతున్నా...అంతిమ లక్ష్యం జగన్ ను ఓడించటం అనేదే ప్రధానంగా ప్రస్తావనకు వస్తోంది. ఇప్పుడు ఢిల్లీ సమావేశాల సమయంలోనూ సీఎం జగన్ కు ప్రజా బలం గురించి ప్రతిపక్షాలే ప్రచారం కల్పిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ - జగన్ మధ్య సంబంధాల వేళ ఇది రాజకీయంగా కొత్త సమీకరణాలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications