చూద్దాం.. ఏమవుతుందో?
ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ దూకుడుగా రాజకీయం చేస్తోంది. గత ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల నుంచి అత్యధిక స్థానాలు వైసీపీ కైవసం చేసుకున్నప్పటికీ టీడీపీ.. వేగంగా పుంజుకుంటూ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకొని వెళతాయంటూ రాష్ట్రంలో మారుతున్న కొన్ని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. వచ్చే ఎన్నికల్లో తనతోపాటు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించాలనే పట్టుదలతో జనసేనాని ఉన్నారు.
భారతీయ జనతాపార్టీతో పొత్తును కోరుకుంటున్నామని, చివరి వరకు వేచిచూసే ధోరణిలోనే ఉంటామని టీడీపీ, జనసేన నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీచేసినప్పటికీ ఓటమి తప్పలేదు. రానున్న ఎన్నికల్లో కూడా భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీచేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఏ నియోజకవర్గం కేటాయిస్తారనే విషయం స్పష్టత లేకుండానే టీడీపీ, జనసేన రాజకీయాలు కొనసాగుతున్నాయి.

కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిలు దూకుడుమీదున్నారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఓటమిపాలైన పులిపర్తి ఆంజనేయులు ఆ పార్టీకి దూరమయ్యారు. దీంతో తోట సీతారామలక్ష్మిని ఇన్ఛార్జిగా నియమించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పదవుల పంపిణీ జరుగుతోంది. రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే జనసేనకు కేటాయించే నియోజకవర్గాలెన్ని?, ఏయే నియోజకవర్గాలను కేటాయించవచ్చు?, అభ్యర్థులెవరు? తదితర విషయాలపై జోరుగా చర్చ సాగుతోంది.
జనసేనకు కూడా ఈ రెండు జిల్లాల్లో బలం ఉండటంతో ఈ రెండు జిల్లాల నుంచే మెజారిటీ సీట్లను తీసుకోవాలనే యోచనలో జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులపై ఒక స్పష్టత వచ్చిన తర్వాతే నియోజకవర్గాలపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు ఎవరి ఊహాగానాలు వారికి వదిలేయడమే.












Click it and Unblock the Notifications