వైఎస్ జగన్ పద్మవ్యూహాలను ఛేదించేదెలా??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యూహాలు రచించడంలో, ప్రత్యర్థి పార్టీలు కోలుకోలేని విధంగా వాటిని అమలు చేయడంలో దిట్ట. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా జగన్‌ను తక్కువ అంచనా వేసి నష్టపోయారని తెలుగు తమ్ముళ్లే చెబుతుంటారు. 151 సీట్లు, 22 లోక్ సభ సీట్లతో భారీ విజయం దక్కించుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అద్భుతమైన వ్యూహరచనతో ముందుకు సాగిన జగన్‌కు ఈసారి అధికార బలం తోడుంది. ఇటువంటి తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఢీకొట్టాలనే సందిగ్ధావస్థలో తెలుగుదేశం, జనసేన ఉన్నాయి.

రాజకీయ చతురతకు తార్కాణం.. కేంద్రంతో సఖ్యత
మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలుకానీ, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా మెలగడంకానీ, అప్పులు తెచ్చుకోవడానికి కేంద్రం అన్ని రాష్ట్రాలకు మోకాలడుతున్నప్పటికీ ఏపీకి అనుకూలంగా వ్యవహరించడంలోకానీ వైఎస్ జగన్ అనుసరించి రాజకీయ చతురత ఉంది. ఆయనకు తోడుగా విజయసాయిరెడ్డి ఉన్నారు.
ఎన్డీయేలో వైసీపీ భాగం కాదనే విషయం తెలిసిందే. సంక్షేమ పథకాల వల్ల వ్యక్తిగతంగా లబ్ధిపొందుతున్నవారిలో ''గతంలో ఏ పార్టీ తమకు వ్యక్తిగతంగా సాయం చేయలేదు.. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ సాయం చేస్తోంది.. అటువంటప్పుడు ఎందుకు తాము వ్యతిరేకంగా వ్యవహరించాలనే'' అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది.

తాను అనుకున్న ఆలోచన లబ్ధిదారుల్లో కలిగితే చాలు..
వరుసగా రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే లబ్ధిదారుల్లో ఇటువంటి ఆలోచన ప్రతిబింబిస్తే చాలు. సరిగ్గా ఇక్కడే ముఖ్యమంత్రి జగన్ తాను అనుకున్నది సాధించారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరుపై కేంద్రం నుంచి రాష్ట్రాలకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ, అప్పులు చేసి పథకాలు అమలు చేయడంవల్ల రుణ ఊబిలో కురుకుపోతున్నామంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ విమర్శిస్తున్నప్పటికీ తాను మాత్రం అనుకున్న పంథాలోనే సాగారు.

కరోనా సమయంలో.... ఆర్థికవేత్తల విశ్లేషణ
కరోనా లాక్‌డౌన్ సమయంలో రోజువారి ఆదాయంపై ఆధారపడేవారు, ఇతరత్రా ఆదాయాన్ని కోల్పోయినవారందరికీ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలద్వారా నేరుగా నగదు అందడంతో అప్పుడు, ఆ తర్వాత.. వారు కోలుకోవడానికి ఉపయోగపడ్డాయనే విశ్లేషణను పలువురు ఆర్థికవేత్తలు వ్యక్తం చేశారు. ఇది ఒకరకంగా లబ్ధిదారులకు మంచి చేసిందన్నారు. ఆ సమయంలో పథకాలద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు అందజేసిన రాష్ట్రం ఏపీ ఒక్కటే. ఈ తరహా వ్యూహాలతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను సులువుగా ఢీకొడతారనే నమ్మకాన్ని వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications