'రత్నాల' కోసం సీఎం జగన్, చంద్రబాబు హోరాహోరీ!
వచ్చే ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. 2029లో ఏపీలో అధికారానికి రావాలని భారతీయ జనతాపార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. వారు అధికారంలోకి రావాలి అనుకున్నారంటూ వారి ప్రణాళికలు వారికుంటాయి. అన్ని రాష్ట్రాల్లో అమలు చేసినట్లే ప్రతిపక్షాన్ని బలహీనం చేసి ఆ స్థానం ఆక్రమిస్తారు. తర్వాత అధికార పార్టీని ఢీకొడతారు.

చెమటోడుతున్న ఇరు పార్టీల నేతలు
2024 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమయ్యే పార్టీకి బీజేపీ నుంచి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి పరిణామాల మధ్య కచ్చితంగా గెలవాలని ఇరు పార్టీల అధినేతలు చెమటోడుస్తున్నారు. కుప్పంలో చంద్రబాబును నిలవరించడంద్వారా నియోజకవర్గంపై బాబు ఎక్కువ దృష్టి సారిస్తారని, తద్వారా రాష్ట్రం మొత్తం ఏకాగ్రత తగ్గుతందనేది వైసీపీ ఆలోచనగా ఉంది. దీనిద్వారా టీడీపీని ఓటమిపాలు చేయవచ్చని భావిస్తోంది. మరోవైపు రాయలసీమ వైసీపీకి బలంగా ఉండటంతో ముందుగా ఇక్కడ వైసీపీని బలహీనపరచాలని, అత్యధిక సీట్లు ఇక్కడినుంచే సాధించాలనే లక్ష్యాన్ని చంద్రబాబు నిర్ధేశించుకున్నారు.

రాయలసీమపైనే దృష్టి
అందుకు తగ్గట్లుగానే రాయలసీమలో చంద్రబాబు పర్యటనలకు ఊహించని రీతిలో స్పందన వ్యక్తమైంది. ఇది ఆ పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. ఉత్తరాంధ్ర, కోస్తా కన్నా రాయలసీమపైనే తెలుగుదేశం పార్టీ దృష్టిసారించింది. రాయలసీమలో రతనాల్లాంటి 52 నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం కుప్పం, హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మిగతా 49 నియోజకవర్గాలు వైసీపీ పరమయ్యాయి. వైసీపీ తరఫున ప్రతి నియోజకవర్గంలోను ఒకరికి మించి సీట్లు ఆశించేవారుండటంతో కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి సెగ తగులుగుతోంది. దీన్ని పార్టీకి అనువుగా వాడుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

గెలిచే అభ్యర్థులకే సీట్లు
రాయలసీమలో గెలిచే అభ్యర్థులు అనుకుంటే సీటు కేటాయిస్తున్నారు. లేదంటే సీనియర్ నేతలను కూడా పక్కన పెడుతున్నారు. కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కుటుంబాన్ని అలాగే పక్కన పెట్టారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఆళ్లగడ్డలో సీటు విషయమై హామీ ఇవ్వలేదు. కొత్త నేతలైనా పర్వాలేదు.. గట్టి అభ్యర్థులు అయివుండటంతోపాటు అంగబలం, అర్థబలం ఉన్నవారిని ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. కోస్తా, ఉత్తరాంధ్ర కన్నా రాయలసీమ నుంచే ఈసారి ఎక్కువ సీట్లు సాధించాలనే పట్టుదలను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా వ్యూహరచన చేసుకుంటున్నారు. మరి బాబు కోరిక తీరుతుందా? లేదంటే సీమలో మరోసారి వైసీపీ జెండా రెపరెపలాడుతుందా? అనేది స్పష్టత రావాలంటే ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చేంతవరకు ఎదురుచూడటమే.












Click it and Unblock the Notifications